వాస్తవం: హైదరాబాద్
ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాన్ని పరిశీలించాలని తాను సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ న్యాయ విభాగం తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. భయాందోళనలు రేపేతట్టుగా ఒక సామాజికవర్గం పేరును తీసుకొని నోటాకు ఓటేయాలని మాట్లాడడం శోచనీయమన్నారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఎల్ బీ నగర్ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. భవిష్యత్తులో పునరావృతంకాకుండా చర్యలకు ఉపక్రమించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా తెలుసని, కాబట్టి అమలుకు సాధ్యంకానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి తప్పుడు హామీలే ఇచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించలేదని, తాము రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా ప్రజలు తమను గెలిపించారన్ని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అదే జరగబోతుందని స్పష్టం చేశారు. తాము అమలుకు సాధ్యంకానీ హామీలేమీ ఇవ్వలేదని, ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తారని తెలిపారు.కేసీఆర్ వ్యూహాత్మకంగానే కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగారన్నారు.
మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకటేనని మండిపడ్డారు. తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తేనే అందరికీ మహిళా బిల్లు గుర్తుకొచ్చిందన్నారు. ధర్నా చేసిన తనను ప్రశ్నిస్తారా లేదా బిల్లును ఆమోదించాల్సిన ప్రధాని మోడీని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. ఎప్పుడైనా ఏ అంశంపై అయినా ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని చూశారా అని అడిగారు. మహిళల హక్కుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని మండిపడ్డారు. చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ కలుగుతుందని, అప్పుడే మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని, కానీ చట్టం చేసే ఉద్ధేశం ఆ రెండు పార్టీలకు లేదని నిరూపించున్నాయని స్పష్టం చేశారు. చట్టం వస్తేనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతందని, కాబట్టి చట్టం కోసం పోరాటం చేద్దామని మహిళలకు పిలుపునిచ్చారు. డిసెంబరులో జంతర్ మంతర్ వద్ద మరోసారి భారీ ధర్నా నిర్వహిస్తానని, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బీజేపీ నాయకురాలు డీకే అరుణ నుంచి స్మృతీ ఇరానీ వరకు అందరినీ ఆహ్వానిస్తానని ప్రకటించారు. ఎవరెవరు వస్తారో ఎవరు రారో… బీజేపీ బిల్లు పెడుతుందా … దానికి కాంగ్రెస్ మద్ధతిస్తుందా అన్నది దూద్ కా దూద్ పానీ కా పానీ అప్పుడు అవుతుందని తెలిపారు.