దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాంగ్రెస్ వైపా.. బీఆరెస్ వైపా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్ ముస్లిం ఓట్లు పంచుకున్నాయి. కానీ ఈసారి బీఆరెస్ ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మోడీ మానియాలో అర్వింద్ ఎక్కడ గెలుస్తాడో అనే భయం ముస్లింలలో ఏర్పడటంతో గెలుపు గుర్రానికే ఓటు వేయాలని ముస్లింలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే గంప గుత్తగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కు పడితే గెలుస్తాడా..? ఎవరికి లాభం ..? ఒకవేళ ఓట్లు చీలి బీఆరెస్ కూడా ఓ ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు రాబట్టుకోగలితే ఈ చీలిక ఓట్లు ఎవరికి లాభం..? అర్వింద్ గెలుపుకు దారి తీస్తాయా..? ఇప్పుడు చర్చంతా దీనిపైనే నడుస్తోంది. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి.
అర్బన్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నందున ముస్లింలు కాంగ్రెస్ వైపు గురి పెట్టారు. అర్బన్ నుంచి పోటీ చేసిన షబ్బీర్‌కు కూడా బాగానే ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మరిన్ని ఓట్లు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. మరోవైపు బీఆరెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు కూడా ఇక్కడ పరిచయాలున్నాయి. పార్టీని చూసి కాకుండా వ్యక్తిగతంగా కొన్ని ముస్లింల ఓట్లు పడతాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముస్లిం సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరికెన్ని ఓట్లు పడతాయో తెలియని పరిస్థితుల్లో బీఆరెస్‌కు పడే ఓట్ల మీదే బీజేపీ, కాంగ్రెస్ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.