దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఇద్దరికీ సోయిలేదు. ఒకరు షాడో సీఎంగా చెలామణి అయిన యువనేత. ఇంకొకరు తాజా సీఎం. తమ రాజకీయాల కోసం, ఎత్తుల చిత్తుల కోసం మహిళలను కించపరుస్తున్నామనే సోయి కూడా లేకుండా పోయిందిద్దరికి. చీరలపై ఛీప్ కామెంట్లతో దిగజారుడు రాజకీయాలకు దిగిపోయారు కేటీఆర్, సీఎం రేవంత్.
ఓడిన తరువాత కేటీఆర్ ఇంకా డిప్రెషన్‌లోంచి బయటకు రాలేదు. ఏదో మాట్లాడబోయి ఏదేదో మాట్లాడి ఉన్న సానుభూతి పొగొట్టుకోని ఇంకా అహంకారియే అనే ముద్ర పోగొట్టులేకపోతున్నాడు. సేమ్ కేసీఆర్ లాగా. మరి రేవంత్ ఆగుతున్నాడా అంటే అవే తిట్ల పురాణాలు. మతితప్పిన మాటలు. ఇద్దరికీ సరిపోయింది. తాజాగా ఈ చీరల టాపిక్ ఎందుకొచ్చిందో.. ఎవరు మొదటి దీన్ని తెచ్చారో తెలుసుకుందాం. పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్‌కు భయం వెంటాడుతోంది. ఆశించిన ఫలితాలు రాకపోతే తన సీఎం సీటు ఉండదనే భయమే అది. దీని కోసం గొంతు చించుకుని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు రేవంత్.
తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేడీస్‌కు ఫ్రీ బస్ జర్నీ అని.. కేటీఆర్ ఓ సారి చీర కట్టుకుని బస్సెక్కి ప్రయాణిస్తే అప్పుడు అర్థమవుతుందని అర్థరహిత కామెంటొకటి చేశాడు. రేవంత్ మాట్లాడిందే చాలా ఛీప్‌గా ఉందంటే.. దీనికి ఇచ్చిన బదులు మరింత దిగజారి ఛీ ఛీ ఛీప్ అనిపించేలా ఉంది. కేటీఆర్ తన ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీ మహిళలు ఇక్కడ 2500 ఇస్తున్నానని చెబుతున్నాడని, ఎక్కడ ఇచ్చాడో చెబుతారా..? ఇవ్వకపోతే నువ్వు కట్టుకుంటావా చీర.. లేకపోతే రాహుల్‌కు కడతావా…? అని సేమ్ మందబుద్దిలాగే స్పందించి తనూ బురదలో కూరుకుపోయాడు.
చీర కట్టుకోవడమే ఛీపా.. చీర కట్టుకోవడమంటే అదో అవమానమా..? ఇదే రీతిలో ఉంది ఈ ఇద్దరి దోరణి. ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదు. అది అందరికీ తెలుసు. దీనికి ఓ ఫ్రీ బస్సు పథకాన్ని చూపి .. అంతా చేసేశామనే బిల్డప్ ఇవ్వడమే రేవంత్ తెలివితక్కువతనం. దీనికి ఇంకా కేటీఆర్‌కు సవాల్ విసరడం.. బస్సులో చీర కట్టుకుని తిరుగు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఏదో తిట్టానని అనిపించుకుని తనను తానే తిట్టుకున్నట్టుంది.
కేటీఆర్ ఎక్కడా ఫ్రీ బస్సు జర్నీ గురించి కామెంట్ చేయలేదు. రేవంత్ ఇంకా చేయాల్సినవి బొచ్చెడున్నాయి. మరి ఎందుకంత అబద్దం. మధ్యలో ఆడవాళ్లను ఇందులోకి లాగి ఆ చీరల గురించి ఛీప్ కామెంట్లు ఎందుకు..? ఇద్దరికీ మెదడు మెకాళ్లలో ఉందని తేలిపోయింది. ఒకరిదేమో సీఎం సీటు ఊడిపోతుందనే భయం.. ఇంకొకరిదేమో జరంతలో సీఎం సీటు చేజారిందని కోపం. మధ్యలో ఆడోళ్ల మీద వీళ్ల ప్రతాపం. కర్రుకాల్చి వాతలు పెడతారిద్దరికీ మీరు మారకపోతే.