దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

అర్వింద్‌కు మోడీ ముఖం తొడిగారు. సిట్టింగ్‌ ఎంపీ వ్యతిరేకతపై బీజేపీ రంగు పులిమారు. మరోమారు మోడీ రావాలనే ఓటరు ఆకాంక్ష ముందు అర్వింద్‌ మైనస్‌లన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఇదే కాంగ్రెస్‌ కొంప ముంచి బీజేపీని పెంచి పోషించిందా..? ఓటరు నాడి చూస్తే అలాగే అనిపిస్తోంది. నిజామాబాద్‌ ఓటరు ఎప్పుడూ విలక్షణమైన తీర్పే ఇస్తాడు. ఇప్పుడూ అదే జరిగింది. అలాంటి ఫలితాలే రానున్నాయి.

ఈ రోజు జరిగిన ఎన్నికల సరళి, ఓటరు నాడి తదితర సమీకరణలు లోతుగా పరిశీలిస్తే బీజేపీ వైపే ఓటరు ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి సిట్టింగ్‌ ఎంపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సాధించిందేమీ లేదు. నిధులు తెచ్చిందీ లేదు. అభివృద్ది చేసిందీ లేదు. అన్నీ ఉత్త మాటలే. పొంకణాలే. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలే. బూతు పురాణాలే. కానీ ఆ వ్యతిరేకత ఎక్కువగా పనిచేయలేదనిపిస్తోంది. అంతా అర్వింద్‌ను కాకుండా మోడీ ని చూశారు. మోడీ ముఖమే వారికి దర్శనమిచ్చినట్టుగా ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. రామ మందిరం ఎఫెక్ట్‌, ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా కావొచ్చు.. బాగానే కనెక్టయ్యారు.

పెరిగిన పెట్రోల్‌ ధరలు గుర్తుకు రాలేదు. నిత్యాసవసరాలు ఆకాశన్నంటి మధ్యతరగతి నడుం విరిచిన విషయమూ మరిచారు. ఇక ముందు చేసేదేమీ లేదని తెలిసీ మోడీ వైపే నిలిచారు. ఇదీ ఇందూరు ఓటరు విలక్షణ ఓటరు తీర్పుగా తెలుస్తోంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉన్నా.. అప్పుడే అందరిలో ఇదే డిస్కషన్‌ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా రెండు జాతీయ పార్టీలు పంపకాలకు దిగాయి. పోటాపోటీగా పోరు ఉంటుందనుకున్నా.. మెజారిటీ బీజేపీ వైపే మొగ్గు చూపేలా ఓటరు తీర్పు రానుందా… అనే విధంగానే చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో అర్వింద్‌కు 70వేల మెజారిటీ వచ్చింది.

ఈ సారి ఎవరు గెలిచినా అంత రాదనుకున్నారు. అసలు గెలిస్తే చాలురా అనే విధంగా పోటీ ఉంటుందని భావించారు. కానీ ఓటరు తీర్పు ఇలా కాకుండా విలక్షణంగా ఉండబోతుందా.? అక్కడ అర్వింద్‌ కాకుండా ఏ అర్బకుడిని నిలబెట్టినా బీజేపీకి ఓట్లు వచ్చేవా..? ఏమో ఓటరు తీర్పు ఎలా ఉంది. ఈవీఎం వీవీ ప్యాట్లలో నిక్షిప్తమై ఉన్న ఆ ఫలితాలు వెల్లడైతే తప్ప ఎవరి ప్రభావం ఎంతుంది..? పార్టీల వారీగా ఓటరు తీర్పునిచ్చాడా..? వ్యక్తిగతంగా అభ్యర్థుల ప్రభావం ఎంత వరకు పనిచేసింది తెలుస్తుంది. మొత్తానికి నిజామాబాద్‌ లోక్‌సభ తీర్పు విలక్షణంగానే ఉండనుంది. మరోమారు రాష్ట్ర స్థాయిలో ఇది చర్చకు తెరతీయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed