దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఓటర్లు డిసైడ్‌ అయ్యారు. విలక్షణ తీర్పునిచ్చేందుకు. నిజామాబాద్‌ పార్లమెంటు ఫలితాలు ఎప్పుడూ డిఫరెంటే. ఈసారి అదే రిపిట్ కాబోతున్నది. గతంతో కవితను ఓడగొట్టి.. అనామకుడు అర్వింద్‌ను గెలిపించిన ఇందూరు ఓటర్లు.. ఇప్పుడు మరో చరిత్ర లిఖించేందుకు సిద్దమయ్యారు. అర్వింద్‌కు ఓటమి భయం పట్టుకున్నది. చివరి రెండు రోజులు ఒక్కసారిగా అర్వింద్‌ సైలెంట్‌ అయిపోయాడు. ఎవరినీ కలవలేదు. బహుశా తను సొంతగా చేపించుకున్న సర్వే ఫలితాల ప్రభావం కావొచ్చు. అర్వింద్‌కు అలవాటు. ముందుగానే గెలుపోటములను లెక్కించడం. డీఎస్‌ రాజకీయాల సమయంలోనే ఇది వంటబట్టించుకున్నాడు.

ఇక అనూహ్యంగా కాంగ్రెస్‌, బీఆరెస్ పుంజుకున్నాయి. కాంగ్రెస్‌పై నాన్‌ లోకల్ ముద్ర వేసి ప్రచారం చేయడం ఎలాంటి ప్రతికూల ఫలితాలిస్తాయో తెలియదు. యువతపై బీజేపీ ఆశలు బాగా పెట్టుకున్నది. ఆ ఓటింగ్‌ శాతం ఎంతుంటుందో అది మెజారిటీ బీజేపీకే లాభం చేకూర్చేలా ఉంది. మైనార్టీలు మెజారిటీగా కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లంతా బీఆరెస్‌ వైపు మళ్లే చాన్స్‌ ఉంది. దీంతో బీఆరెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందనే మొదట వేసిన అంచనా తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. దీంతో ఎవరి గెలుపోటములు ఎవరి నిర్ణయిస్తారోననే ఉత్కంఠ నెలకొన్నది.

ఎవరికి వారే గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. గెలిస్తే చాలు అదే పదివేలు.. మెజారిటీ దేవుడెరుగు అన్న పరిస్థితికి వచ్చారు ఎవరికి వారు. ఎర్రటి ఎండల నడుమ మధ్యాహ్నం లోపు యాభై శాతం పైగా పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. దాదాపు 14 లక్షల ఓట్లలో 10 లక్షల ఓట్ల వరకు పోల్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో 4 లక్షలు సాధించిన అభ్యర్థి గెలుపు ఖాయంగా ఉంది. గతంలో మెజారిటీ 70వేలకు చేరింది. ఇప్పుడంతగా ఉండదు.

పది పదిహేను వేలు వచ్చినా ఆశ్చర్యం లేదు. బంపర్‌ మెజారిటీని ప్రస్తుత త్రిముఖ పోటీలో ఊహించలేము. ఒకవేళ ఎవరికైనా బంపర్‌ మెజారిటీ సంభవిస్తే అది మామూలు విజయం కాదు. అభ్యర్థిని చూసి ఓట్లేసినట్టే. అలాంటి పరిస్థితి బీజేపీకి లేదు. కాంగ్రెస్‌, బీఆరెస్‌కు ఉంది.

 

You missed