(మీడియా గాధలు – 1)
నమస్తే తెలంగాణ పత్రిక పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఏదో వార్తకు ఇది కేంద్రబిందువుగా మారుతూ వస్తున్నది. కొత్త ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి ఇందులో. కీలక విభాగాల హెచ్‌వోడీలు అంతా మారారు. మారేలా చేశాడాయన. స్టేట్ బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీష్, నెట్‌వర్క్ ఇన్‌చార్జి ఎస్జీవీ శ్రీనివాస్ రావు మినహా.. మిగిలిన వారంతా మారిపోయారు.
ఈయన వస్తున్నాడని తెలిసిన రోజే .. సెంట్రల్ డెస్క్ ఇన్ చార్జి , డిప్యూటీ ఎడిటర్ కృష్ణమూర్తి (కేఎం) రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కీలక విభాగాల్లో తన వారిని తెచ్చుకున్నాడు. సహజమే. కానీ ఉన్నపళంగా వారికి వేరే ఉద్యోగాలు లేక.. ఆ పొజిషన్ దొరకక.. ఇతరత్రా పనుల్లో ఇరికిపోయారు తర్వాత. ఎవరూ కిక్కురుమనలేదు. ఇక జిల్లాల్లో తన ముద్ర వేసుకునేందుకు తీగుళ్ల అనుకునే సమయానికి కరోనా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆయన ఆలోచనలకు ఊతమిచ్చింది. కరోనాతో ఖర్చు పెరిగిపోయిందనే సాకుతో ఎడాపెడా జిల్లాల బ్యూరో ఇన్చార్జిలను పీకేశాడు. మేనేజ్‌మెంట్ తలాడించింది. ఖర్చులు తగ్గిస్తున్నాడు… సంస్థ శ్రేయోభిలాషి అని సంబరపడింది.
కరీంనగర్ బ్యూరో ఇన్చార్జి ప్రకాశ్ రావు మినహా అంతా గెంటివేయబడ్డారు. వారి బతుకులు తలోదిక్కుగా మారాయి. అంతా గుత్తాధిపత్యం నడిచింది. కేసీఆర్ నా మీద నమ్మకం పెట్టి పంపాడు. నేను ఎలా చెప్తే అలా. ఎవరూ దీన్ని కాదనొద్దు.. అనే రీతిలోశాసించాడు. అంతా తోకాడించారు. మా ఉద్యోగం ఉంటే చాలురా భగవంతుడా అని వణికిపోయారు.
రిటైర్‌మెంట్ ఏజ్ వచ్చినా.. కొందరికి పొడిగింపు లభించింది. అదీ ఎడిటర్‌కు నచ్చినవారికి. నచ్చని వారిని గెంటేశారు. సార్ ఇంకో ఏడాది ఇస్తరేమో అనుకున్న అని సిగ్గు విడిచి అడిగినా.. ఇది నా నిర్ణయం కాదబ్బా.. అంతా ఎండీ గారిదే అంటాడు. ఎండీగారు తనకు ఏ చిన్న మెసేజ్ వచ్చినా.. న్యాయం చేయండని మొరపెట్టుకున్నా.. వెంటనే అది ఎడిటర్ టేబుల్ మీదకు చేరుతుంది. నీ ఇష్టం అన్నట్టుగా. అంటే ఆయన అంతటి నిమిత్తమాత్రుడన్న మాట. ఆ విషయం ఉద్యోగులందరికీ తెలుసు. అందుకే ఎడిటర్ దగ్గరే బతిమాలి, బామాలి, కాదని తెలిసిపోగానే కాళ్లీడ్చుకుంటూ వెళ్లిపోవాలి. ఇక ఆనాటి నుంచి ఆ సంస్థతో బంధం తెగిపోయినట్టే. ఇక ఆ మెట్లేక్కేందుకు అర్హత ఉండదు. ఎక్కినా.. ఎవరూ కలవరు. ఈ మధ్య కొందరు సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్ గెంటివేతకు గురయ్యారు. ఫేస్‌బుక్కుల్లో తమ ధిక్కార స్వరాన్నివినిపించారు వాళ్లు. సహజమే. కానీ ఘాటుగా.
ఇది కేటీఆర్‌కు తెలుసు. కవితకూ తెలుసు. కానీ ఏం చేయలేరు. అంతా కేసీఆర్ ఇష్టం. ఆయన పెట్టిన మనిషి కాబట్టి వీళ్లు జోక్యం చేసుకోరు. ఎవడు పోతే మాకేందీ..? మా వార్తలు వస్తున్నాయి కదా… మంచిగా తీర్చిదిద్ది మాకు కనువిందు చేస్తున్నాడు కదా.. అని సరిపెట్టుకుంటున్నారేమో బహుశ. అక్కడ ఏర్పడిన గ్రూపులు పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పే తెచ్చి పెట్టింది. తమ ఆధిపత్యం కోసం ఓవైపు ఓరుగంటి, మరో వైపు ఎస్జీవీ. వీరిద్దరికీ చెక్ పెట్టేలా తీగుళ్ల నిర్ణయాలు. అంతా నాదే నడవాలి. నాకే అంతా వినాలి. భయపడాలి. ఒకరిపై మరొకరి ఫర్యాదులు, అసంతృప్తులు, చాడీలు… ఇలా నడుస్తున్నది ప్రస్తుతం. మధ్యలో బలయ్యేది.. భయపడుతూ బతికేది… నిత్యం నరకం చూసేది .. కింద పనిచేసే బక్క ఉద్యోగులు, బడుగు జీవులు.
కరోనా వేళ ఉద్యోగాలు తీసేస్తే జిల్లాల నుంచి సబ్ ఎడిటర్లు, స్టాప్, రిపోర్టర్లు.. అంతా వచ్చి నమస్తే తెలంగాణ హెడ్ ఆఫీసు వద్ద ధర్నా చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కేటీఆర్‌కు తెలిసింది. వెంటనే పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వాళ్లకు రెండు నెలల జీతాలు వేసేయమన్నాడు. అలా రెండు నెలల జీతాలతో వారికి పడేసి సంస్థతో బంధాలు తెంపేశారు. ఎత్తిన నోరు మూసేశారు. అప్పటికి ఉపద్రవం అలా తప్పిపోయింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గెంటివేత అవమానాలతో రగిలిపోతున్నారు. ఈ తెగుళ్ల చిచ్చు ఇంకా ఎంత వరకు పోతుందో..?
(చీమలు పెట్టిన పుట్టలో… మీడియా గాధలు – 2 రేపు)