దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీస్‌ అని తెలంగాణకు ప్రత్యేకంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టో రాష్ట ప్రజలను ఆకర్షిస్తున్నది. ఇది ఊహించని పరిణామమే అంతా. వాస్తవానికి రాష్ట్రంలోని చాలా సీట్లలో బీజేపీ హవా కొనసాగుతోంది. మోడి మానియాలో జనాలున్నారు. కాంగ్రెస్‌ గట్టి ఫైట్‌ ఇస్తున్నా.. విజేతగా నిలబడే క్రమంలో సీట్లను చేజార్చుకునే అవకాశాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గ్రహించాడు. ఇప్పుడు రేవంత్‌కు ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించి అధిష్టానానికి బహుమానంగా ఇవ్వడమే ఏకైక లక్ష్యం. అదే అతనికి అగ్ని పరీక్షగా మారింది.

ఎక్కువ సీట్లు సాధిస్తే తప్ప తన సీఎం సీటుకు ఢోకా ఉండదని ఫిక్స్‌ అయిపోయాడు. రాజకీయ వాతావరణం కూడా అలాగే ఉంది. దీంతో ప్రతీ సీటు గెలవడం కోసం ఎన్నో శక్తియుక్తులు, ప్రయోగాలు, వలసలపై సీరియస్‌గా దృష్టి పెట్టాడు రేవంత్‌. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఏఏ లోపాలున్నాయి. గతంలో బీఆరెస్‌ ఎక్కడ ఏవీ సాధించడంలో విఫలమైంది. తెలంగాణ నాడిగా, ఆత్మగౌరవంగా చెప్పుకునే డిమాండ్లు జాతీయ స్థాయిలో ఏవేవీ సాధించి పెడతామంటే జనం మనవైపు వస్తారు. బీజేపీని ఇలాగైతే నిలువరించి, మోడీ జపం నుంచి డైవర్ట్‌ చేయవచ్చు అనే ఆలోచనతో ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేసింది అధిష్టానం.

మ్యానిఫెస్టో కూడా ఉత్తిత్తిగా లేకుండా చాలా అంశాలు కీలకమైనవే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. వాటిల్లో ఇంకా చాలా చాలా చేయాల్సినవి మిగిలే ఉన్నాయి. ఇప్పుడే కదా వచ్చాం. చేస్తాం అన్నీ. అంటూ చెబుతూ వస్తోంది. కొందరు ఇప్పటికే ఇదేం ప్రభుత్వం రా అనుకుంటుండగా.. చాలామంది మనమే తెచ్చుకున్నాం కదా.. కాస్త టైం ఇద్దాం.. ఓపిక పడదాం అనే దోరణితో ఉన్నారు. దీని వల్ల కాంగ్రెస్‌ పై ఇప్పటికే ఏం నమ్మకం మెజారిటీ జనాల్లో సడలేదనే చెప్పాలి.

అందుకే ఈ ప్రత్యేక మ్యానిఫెస్టో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నది. డిస్కషన్‌కు తావిస్తున్నది. ఎంతోకొంత ఇది ప్రభావం చూపే అవకాశాలూ లేకపోలేదు. ఇలా ఏ అవకాశం దొరికినా అది కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకుని ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్‌ ముందుకు సాగుతోంది. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. అన్నీ అబద్దపు హామీలే అంటూ విమర్శలు గుప్పిస్తోంది.

You missed