దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పాపం..! జీవన్‌రెడ్డి. వయస్సు పై బడి ఎర్రటి ఎండను లెక్క చేయకుండా తిరుగుతున్నా.. గెలుపు తీరాలకు చేరే విషయంలో సొంతింటిలోనే కుంపట్లు రాజుకోవడం అసలుకే ముప్పు తెచ్చేలా ఉంది. సమన్వయం లేకపోవడం, ప్రచార సరళి, ఖర్చు పై ఎవరికీ సరైన బాధ్యత లేకపోవడంతో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ ఏదో మమ అనిపించేస్తున్నారు.

గెలిస్తే కేంద్ర మంత్రి ఏమోగానీ, గెలుపే ముళ్ల దారిలా మారిందిప్పుడు ఆయనకు. జిల్లాకు చెందిన సీనియర్లు చాలా మంది అతని గెలుపును కోరుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గుతుందోనని కొందరు, తమను అసలు పట్టించుకోవడమే లేదని మరికొందరు.. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రచారం చేసిన లోలోన అలా కానిచ్చేస్తున్నారు.

జీవన్‌రెడ్డి కచ్చితంగా గెలిచి తీరాలని ఎంత మంది అనుకుంటున్నారో.. అంతకు మించి సీనియర్లు గెలవొద్దని కోరుకుంటున్నారు. ఇందూరు కాంగ్రెస్‌లో ఇదో విచిత్ర పరిస్థితి. పార్లమెంటు ఇన్చార్జిగా మాజీ మంత్రి , బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నాడు. కానీ అతను పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

కాబోయే మంత్రి అని మొదటి నుంచి సుదర్శన్‌రెడ్డిని పెద్దమనిషిగా చూస్తున్నారు. జిల్లా పార్టీకి పెద్ద దిక్కు కూడా ఆయనే. కానీ ఆయన తనకు ఇచ్చిన బాధ్యతలు, పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం చేరడం లేదు, చేయడం లేదు. దీంతో కరుడు గట్టిన కాంగ్రెస్‌ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. గెలిచేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నా.. ఇలా సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ రావడం మింగుడు పడటం లేదు.

అర్వింద్‌పై వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకతను తాము సానుకూలంగా మలుచుకుని గెలవాలని తొలత కాంగ్రెస్‌ భావించింది. కానీ సొంత పార్టీలోనే గ్రూపులు, వర్గ విభేదాలు, ఇగోలు.. అన్నీ కలిసి పెద్ద మనిషి జీవన్‌రెడ్డి కొంప ముంచేలా ఉన్నాయి.

You missed