దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇప్పుడంతా రామమయం నడుస్తోంది. బీజేపీ ఒకటే రామజపం చేయడం లేదు.. మిగిలిన రెండు పార్టీలు అన్యపదేశంగా, అనివార్యంగా రామజపం చేయాల్సి వస్తోంది. బీజేపీ రాముడిని ఓన్‌ చేసుకుంటుందనే సంకేతాలున్న కాంగ్రెస్‌, బీఆరెస్‌.. దీన్ని నిలువరించేక్రమంలో ఎత్తులు వేసేందుకు తత్తరపాటుకు లోనవుతున్నది. సున్నితమైన అంశం కావడం, పార్లమెంటు ఎన్నికల వేళ మతం, రాముడులాంటి పదాలను వాడేటప్పుడు జాగురుకతతో వ్యవహరించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ అంశంపై ముఖ్యనేతలు ఏది మాట్లాడినా అది ఎటు తిరిగి ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.

మోడీ హవా కొనసాగుతుందనే సంకేతాలున్న కాంగ్రెస్‌ దీన్ని కట్టడి చేసేందుకు ఏదో ఒకటి ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తోంది. అందుకే డేర్‌ చేసి సీఎం రేవంత్‌ మొన్న నిజామాబాద్‌ బహిరంగ సభలో ‘ దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి.. బ్యాలెట్ బాక్సులో కాద’ంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇది ఎంత మంది ఎలా స్వీకరిస్తారో తెలియదు. కానీ సీఎం రేవంత్‌ మాటల్లో ఈ రాముడు, హిందుత్వం బీజేపీకి మైలేజీ ఇచ్చే అంశంగా మారిందని చెప్పకనే చెప్పినట్టు భావించొచ్చు.

ఇక తాజాగా భువనగిరి బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ కూడా రామజపం చేశాడు. రాముడిని నమ్ముకుంటే కడుపునిండుతుందా..? మేమెప్పుడైనా మత రాజకీయాలు చేశామా..? అని ప్రశ్నించినట్టే ఆయన స్పీచ్‌ కొనసాగింది. యాదాద్రిని అంత అద్బుతంగా తీర్చిదిద్దినం.. ఏనాడైనా మేము దాన్ని ఓట్ల రాజకీయాలుగా మలుచుకోవాలని చూశామా..? అని అడిగాడు. ఇది కూడా బీజేపీని టార్గెట్ చేసేలా ఉంది. కానీ మోడీ, బీజేపీని నిలువరించేందుకు పాలసీ పరమైన ఇంకా ఏమైనా మాట్లాడొచ్చు. అలా కాకుండా మతం, హిందుత్వం, జై శ్రీరామ్‌… ఇవే బీజేపీకి కీలకమైన అస్త్రాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నట్టున్నాయి.

అందుకే ఈ అంశాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో టచ్ చేస్తున్నారు. ఆ క్రమంలో తడబడుతున్నారు. తత్తరపాటుకు లోనవుతున్నారు. ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు అది ఎలా చేరుతున్నదో.. వారు ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారో.. అనేదే  సస్పెన్స్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed