దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పార్లమెంటు ఎన్నికల్లో పైసలు పంచే సంస్కృతికి తెరలేపాయి పార్టీలు. రెండు ప్రధాన పార్టీలు ఓటర్లకు పైసలతో గాలం వేశాయి. పోలీసులకు నాయకులు చిక్కారు. కేసులు పెట్టారు. కొందరు దొరకకుండా పంచారు. ఇంకొందరు ఓటర్‌ స్లిప్పులు పట్టుకొస్తే చాలు డబ్బులిచ్చి పంపారు. అర్థరాత్రుల వరకు తమకు పైసలు పంచుతారనే ప్రచారంతో ఇళ్ల వద్ద వేచి చూశారు చాలా మంది జనం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ లేవు. నిజామాబాద్‌ లోక్‌సభకు ఈసారి తీవ్ర పోటీ నెలకొన్నది. సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌పై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడ్డది.

దీంతో మరోసారి గెలవాలంటే చేతి చమురు వదిలించుకోక తప్పదనే రీతిలో బీజేపీ మొదటిసారి బాగానే ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ కూడా చివరగా తమ ప్రతాపం చూపింది. అర్వింద్‌పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చివరి రెండు మూడు రోజులు చేతికి పని చెప్పారు. డబ్బులు పంచుతున్నారనే వార్తలు మాత్రం ఎన్నికలకు ఒకరోజు ముందు రాత్రి గుప్పుమన్నారు. దీన్ని నిజం చేస్తూ పలు చోట్ల రెండు ప్రధాన పార్టీల పంపకాలు బయటపడ్డాయి.

పైసల పంపకాలపై చర్చ మొదలైంది. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేకుండే.. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా పైసలు పంచుతున్నారా అని డిస్కషన్‌ చేసుకోవడం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పంపిణీ తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ ఎన్నికలకూ ఈ రోగం తగులుకుంది.