దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

అర్వింద్‌ గెలుపు ఖాయమైంది. మెజారిటీ ఎంతన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎవరి అంచనాల్లో వారున్నారు. కాంగ్రెస్‌ తమకు లక్ష మెజారిటీ వస్తుందని గాంభీర్యం ప్రదర్శిస్తుండగా.. బీజేపీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లక్షకు మంచి తమకు మెజారిటీ రానుందని కాలరెగరేసి చెబుతూ వస్తోంది. అయితే సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు నిజామాబాద్‌ లోక్‌సభలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిందట. ఈ విషయం బీజేపీ ముఖ్య నేతలకు చేరవేయడంతో ఇది ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి బలాన్నిచ్చి బంపర్ మెజారిటీని అందించిన నియోజకవర్గాలేవో తెలిసిపోయింది. ఆర్మూర్‌, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్ద మెజారిటీ రానుందట. ఆ తరువాత బాల్కొండ నియోజకవర్గంలో కూడా బీజేపీ మంచి లీడ్‌ను తీసుకురానుందని బీజేపీ నేతలకు సమాచారం అందింది. ఈ మూడు నియోజవకర్గాల్లో బీజేపీకి బాగా ఓట్లు పడ్డాయని క్లారిటీకి వచ్చారు. వీటిల్లో మొత్తం బీజేపీకి యాభై వేల పై చిలుకు మెజారిటీ దక్కించుకోనుందని కూడా లెక్కలు వేసుకున్నారు. కాగా బోధన్‌, అర్బన్‌లో బీజేపీకి పెద్దగా లీడ్‌ రావడం లేదట.

కాంగ్రెస్‌తో విపరీతమైన పోటీని ఎదుర్కొన్న బీజేపీ.. ఇక్కడ కాంగ్రెస్‌ కన్నా పెద్దగా ఓట్లు రాబట్టలేదని తెలిసింది. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌తో పోటీగా ఓట్లు దక్కించుకన్నదని అంచనాలు వేసింది. జగిత్యాలలో బీజేపీ వెనుకబడింది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఆర్మూర్‌, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించగా.. అర్బన్‌, బోధన్, రూరల్ కలుపుకుని 5వేల నుంచి 8 వేల వరకే మెజారిటీ ఓట్లు రాబట్టగలిగినట్లు లెక్కలు వేసుకున్నారు.

ఈ లెక్కన మొత్తంగా అర్వంద్‌కు 50వేల మెజారిటీ నుంచి 75 వేల మెజారిటీ వచ్చే అవకాశాలున్నట్టుగా కీలక బీజేపీ నేత ఒకరు ‘వాస్తవం’తో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed