నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి పత్రిక పై తన పట్టును కోల్పోతున్నారా….? తీగుళ్ల తీగ కట్ అవుతుందా….? నమస్తే తెలంగాణ లో ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయిందా…? పత్రిక పై ఆయన పట్టును కోల్పోయారా…? ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కచ్చితంగా ‘అవును’ అనే సమాధానం వస్తున్నది. అన్నీ తానే నని విర్రవీగుతూ ఉన్న వ్యవస్థను నీరు కార్చి కొత్త అవస్థలు కొని తెచ్చుకున్న ‘తీగుళ్ల’ అసలు సత్తా ఏమిటో అధిష్టానం పసిగట్టింది. తనకు అడ్డే లేదని పాత వారిపై…. నచ్చని ఉద్యోగులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ‘తీగుళ్ల’ ‘నమస్తే’ సంస్థలో ప్రాబల్యం కోల్పోతున్నారు. నమస్తే తెలంగాణ సరిపోదు అన్నట్టు టీ న్యూస్ లో వేలుపెట్టి కాల్చుకున్న ఆయనకు కష్టకాలం మొదలైనట్లేనని ప్రచారం జరుగుతున్నది. ఆయన హనీమూన్ పీరియడ్ ముగిసినట్లేనని చెబుతున్నారు.
మూడేళ్ల అగ్రిమెంటు పీరియడ్ పూర్తవుతున్న దశలో అధిష్టానం తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. కొత్త నాయకత్వం కోసం పత్రిక యాజమాన్యం ఆలోచిస్తుందని ఇంటాబయటా ప్రచారం జరుగుతున్నది.
‘తీగుళ్ల’ ఏనాడైతే ‘నమస్తే’ లో ఎంటరైండో ఆనాటి నుంచి ఆ పత్రికకు మరింత కష్టకాలం దాపురించింది. ఏదో చెప్పి.. ఏమో చేస్తానని ప్రగల్బాలు పలికి కరోనా మహమ్మారి కంటే కాస్త ముందే ఎంటరైన ‘తీగుళ్ల’ మొత్తం వ్యవస్థనే మారుస్తాం అని చెప్పి కొత్త అవస్థలు తెచ్చి పెట్టారు. పత్రికను నమ్ముకున్నవాళ్లను ఆగం జేసి తన సొంత వ్యవస్థను సృష్టించుకో డానికి ఇతరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
‘తనకు నచ్చిందే రంభ… తాను మునిగిందే గంగ …’ అన్న తీరులో పత్రిక కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన ఆయన సత్తా ఏమిటో అధిష్టానవర్గం పసిగట్టింది. కాస్త ఆలస్యంగానైనా పత్రిక మీద దృష్టి సారించింది.
ఇటీవల మంత్రి కేటీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పత్రిక నడుస్తున్న విధానంపై , ఎడిటర్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ‘పత్రికలో రిడబులిటీ వార్తలు ఏవి…? ఇంకా ఎప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది…? పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది తప్ప మెరుగుపడడం లేద’ని తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు.
‘ఇంకా ఇప్పటికీ మేము పరాయి పత్రికల్నే నమ్ముకోవాలా..? సొంత పత్రిక ఉన్నా ఫలితం శూన్యమేనా..? ఎన్నికలప్పుడు మన పత్రిక చేసిన మేలేందీ..? ఇలా అయితే లాభం లేదు… ఇకపై ప్రతి వారం నేనే ఈ పత్రికపై రివ్యూ చేస్తాను..’ అని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
వాస్తవంగా కృ.తి ఎంటరైనతర్వాత అన్నీ పరాజయాలే. పరాభవాలే. తాను ఏదో చేస్తానని చెప్పి ఎంటరై గప్పాలు కొట్టుకున్న ఈ ఎడిటర్ తన కులానికి ఎనలేని ప్రాధాన్యత నిచ్చి అపప్రదను మూటగట్టుకున్నారు. తనకు సీఎం వద్ద ఎవరూ అడ్డు ఉండరాదని అదే కులానికి చెందిన బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీష్ ను
చీప్ గా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. ఇక నెట్వర్క్ లేకుండా కంట్రిబ్యూటర్ నుంచి బ్యూరో చీఫ్ ల వరకు అన్నీ తానై వ్యవహరించారు. తనకు అనుకూలంగా వ్యవస్థను మలచుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి కూడా అలవికాని పెత్తనాన్ని అప్పగించారు. ‘నవ్విపోదురు గాక నాకేటి .. ‘ అన్నట్లు వ్యవహరించారు.
తన పూర్వ ఆశ్రమం లోని ఆంధ్రజ్యోతి టీమ్‌ను నింపుకునే ప్రయత్నం చేశాడు. నమస్తే తెలంగాణను నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచాడు. ఈ విషయంలో బ్యూరో చీఫ్ నుంచి నెట్వర్క్ ఇన్చార్జి నుంచి కొంత ప్రతిఘటన ఎదురు కావడంతో తన స్పీడు తగ్గించారు. ఆ క్రమంలో కొంత పాత టీం బతికిపోయింది.
అసలు తీగుళ్ల ఎంట్రీ తోనే కష్టాలు మొదలయ్యాయి.
ఒకవైపు కరోనా…. మరోవైపు పార్టీకి ప్రతికూల పరిస్థితులు… ఇంకోవైపు పత్రిక సర్క్యులేషన్ అట్టడుగు స్థాయికి చేరడం …. ఇలా ఎన్నో కష్టాలు.
వరుసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో టీఆరెస్ పరాభవం కూడా పత్రికలోని పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఎంతో కొంత వాస్తవాన్ని అధిష్టాన వర్గానికి చెప్పకుండా తన నాయకత్వంలో అంతా బాగా జరుగుతుంది అని లేనిపోని ఆశలు పెంచారు.
కొంత ఆలస్యంగానైనా అధిష్టానవర్గం ఇప్పుడిప్పుడే అప్రమత్తం అవుతున్నది. పత్రికలో జరుగుతున్న నష్టాలను సకాలంలో నివారించకుండ ఆలస్యంగా మేలుకోవడం అధిష్టాన వర్గానికి షరా మామూలు వ్యవహారంగా మారింది.
మంత్రి కేటీఆర్ ఎంట్రీతో పత్రికలో సీను మారుతుంది.
‘తానే సర్వం.. అహం బ్రహ్మాస్మి’ అన్న తీరులో వ్యవహరించిన తీగుళ్ల నాలుగడుగులు వెనక్కి వేయక తప్పలేదు. తన మనుషులు అనుకున్న వాళ్లను కూడా బదిలీ చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
నాటి నుంచి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆల్ బ్యూరో చీఫ్ ఓరుగంటి తన పట్టు బిగిస్తున్నారు. తన వారు అనుకున్న వారిని తీగుళ్ల బారి నుంచి కాపాడుకుంటున్నారు.
ఇటీవల కేటీఆర్ కృ.తి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఓరుగంటి ప్రాధాన్యత పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. ఉన్న నమస్తే తెలంగాణ చాలక… మంచిగా నడుస్తున్న టీ న్యూస్ లో వేలు పెట్టాడు. తన గ్యాంగ్‌ను అందులోనూ దింపాడు. కానీ కొద్ది కాలంలోనే అది బెడిసి కొట్టింది. దీంతో మళ్లీ నమస్తేకు వచ్చి పడ్డాడు. అక్కడ టీ న్యూస్‌లో కృ.తి గ్యాంగ్‌ను ప్రాధాన్యత తగ్గించి పక్కన పెట్టేపనిలో ఉన్నారు. ఎంపీ సంతోష్ రావు ఆగ్రహానికి కూడా గురయ్యాడు కృ.తి.
కొత్త నాయకత్వం కోసం అధిష్టానం అన్వేషణ చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.
MM ROYAL