(దండుగుల శ్రీనివాస్)
అది బహిరంగ సభైనా, అసెంబ్లీ హాలైనా..! ప్రెస్‌మీటైనా.. టీవీ స్టూడియో అయినా..! బస్సు యాత్రైనా.. మరికేందైనా..! అక్కడ పిన్‌డ్రాప్ సైలెంట్ ఉండాలె. చేతులు కట్టుకుని అంతా వింటూ ఉండాలె. ఎవరూ నోరు తెరవొద్దు. ఏదో బాలయ్య బాబు సినిమాలో డైలాగులో చెప్పినట్టు ‘ నేను చెప్పినప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని నీ నోరు పనిచేసిందో నీకు నెక్ట్స్ బర్త్‌డే ఉండదు’..!! సరిగ్గా ఇదే తరహా దోరణి కేసీఆర్‌ది. అది దొరహంకారమో.. దురహంకారమో గానీ ఈ తరహా మనస్తత్వం ఆయనకు ఆది నుంచే ఉంది. బాగా దగ్గరగా అతన్ని చూసినవాళ్లకు మాత్రమే ఇది తెలుసు.
సీఎం అయిన తరువాత ఈ తరహా మెంటాలిటీ మరింత చెలరేగింది. ఇక తనకు మించిన ఘనుడే లేడనుకుని జబ్బలు చరుచుకోవడం బాగా అలవాటైంది. దీనికి తోడు తనకు సహజసిద్దంగా వచ్చిన చెబితే వినాలంతే.. అనే దోరణి అతని రాజకీయ జీవితాన్నే మింగేసే స్థితికి తెచ్చింది. ఇదేదో అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ ఓ సారి బాగా గమనించండి.. అతని మానసిక స్థితి , ప్రవర్తించే తీరు.. నడుచుకునే పద్దతి, మాట్లాడే సరళి.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇదే ‘వాస్తవం’..!
అసెంబ్లీలో అడుగుపెడితే తను చెప్పిందే సభ్యులంతా పిన్‌డ్రాప్ సైలెంట్‌గా వినాలి. ఎవరూ ఏమీ ప్రశ్నించొద్దు. మధ్యలో అడ్డుతగలొద్దు.చిరాకేస్తుంది కేసీఆర్‌కు ఇలా చేస్తే. అసహనం ప్రదర్శిస్తాడు. కసురుకుంటాడు. కరిచేసినంత పనీ చేస్తాడు. అందుకే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకగా ఉండే ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూశాడు. ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చాడు. తను తీసిన గోతిలో తానే ఇరుక్కుపోయి ఊపిరాడక రాజకీయంగా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నాలుగ్గోడల మధ్య కూర్చున్నప్పుడు సన్నిహిత నేతలతో ఎలాగైన ప్రవర్తించు.. ఎవరికీ నష్టం లేదు.
కానీ భారీ బహిరంగ సభ వేదికల్లో కూడా ‘ అరే ఎవడ్రా వాడు హౌలాగాడు..! నేను మాట్లాడింది వినొద్దా.. ఎందుకు ఒర్రుతున్నావ్.. పొద్దుగూకలేదు అప్పుడే చెడిపోయావా..! అని నీ మీటింగుకు వచ్చిన నీ కార్యకర్తల్నే హేళన చేస్తివి. ఎక్కిరిస్తివి. బెదిరిస్తివి. తిడితివి. లైవ్‌లో జనాలూ చూసిరి. ఇక ప్రెస్‌మీట్‌లో అంతే ప్రశ్న తిక్కగా ఉంటే తాటతీసినంత పనిచేస్తాడు. ఓపిక.. సహనం మరిచి మేథావిననే విషయం కొద్ది క్షణాలు మైమరిచి చెలరేగిపోతాడు. మాటలతో ఎదురుదాడి చేస్తాడు. లైవ్ షోలో అయినా ఇంకేదైనా నేను చెప్పింది చేతులు కట్టుకుని సైలెంట్‌గా వినాలె. అవే నిజాలుగా గ్రహించాలె. భ్రమించాలె. గీతోపదేశంలా స్వీకరించాలె. అంతే.
నేను కారణజన్ముడ్ని.. మీ దరిద్రపు అవతారాలను, మీ నీచనికృష్ట జీవితాలను మార్చేందుకు వచ్చిన అవతార పురుషుణ్ణి నన్నే ప్రశ్నిస్తారా..? నిలదీస్తారా..? ఎదురు మాట్లాడతారా..!! ఎన్ని గుండెల్రా మీకు అనే రేంజ్‌లో ఆయన రివేంజ్ ఉంటుంది. ఆయన అంతే మరి. తనే అంతా అనుకుంటాడు. అంతా తన గురించి గొప్పలు చెప్పుకోవాలని తపిస్తాడు. కీర్తికండూతి ఆకాశాన్నింటిన వేళ ఇలా పాతాళంలోకి జారిపోతాడు.