దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. హేమాహేమీలు ఇక్కడ నుంచి ఎదిగిన వారే. నిజామాబాద్ రాజకీయాలెప్పుడు వార్తల్లో కేంద్రబిందువు. ఇప్పుడు కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ ఇద్దరి లోటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకరు మాజీ సీఎం కేసీఆర్ కూతరు, ఎమ్మెల్సీ కవిత. సీనియర్ కాంగ్రెస్ నేత డీఎస్. గడిచన పార్లమెంటు ఎన్నికలు వీరిద్దరి మధ్యే అన్నంత ఉత్కంఠగా సాగాయి.
కొడుకు అర్వింద్ గెలుపు కోసం, కేసీఆర్ మీద పగతో కవితను చిత్తుగా ఓడించాలని కంకణం కట్టుకున్న డీఎస్.. అనుకున్నది సాధించగలిగాడు. అప్పట్నంచి కవిత తండ్రీ కొడుకుల మీద పగబట్టింది. కానీ తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. జీవిత చరమాంకంలో పెద్ద కొడుకు సంజయ్ కోసం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కానీ అర్వింద్ కాంగ్రెస్‌లో చేరనీయలేదు. కాంగ్రెస్ నేతలను డీఎస్ దరిచేరనీయలేదు. సీరియస్‌గా ఉన్న కనీసం ఒక్కరు కూడా పలకరించని పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎస్ రోజులు వెళ్లదీస్తున్నాడు.
కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకు పంపాడు మోడీ. పార్లమెంటు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడయ్యే వరకు ఆమెకు బెయిల్ దొరికేలా లేదు. కీలకమైన ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఇద్దరు అందుబాటులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. డీఎస్ క్రియాశీలకంగా ఉండి ఉన్నా.. ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపకపోయేదేమో గానీ, కవిత ఉంటే మాత్రం బీఆరెస్‌లో ఊపు వచ్చేది. అర్వింద్‌కు ముచ్చెమటలు పట్టేవి.