అందరితో పెట్టుకో కానీ ఆడోళ్లతో పెట్టుకోకురోయ్‌..! మామూలుగా ఈ పదం వాడుతూ ఉంటారు. నిజమే.. మహిళల శక్తి అలాంటిది మరి. అందుకే అంత భయపడాలి. అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. వారి ప్రేమాభిమానాలు చూరగొనాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ మహిళల నుంచే తొలి ఆగ్రహ జ్వాల ఎదురవుతోంది. రైతుబంధు సకాలంలో ఇవ్వకున్నా ఊకున్నారు. నాలుగు వేల పింఛన్‌ ఇవ్వకున్నా సరేలే కొంచెం టైమిద్దామని వదిలేశారు. ఐదు లక్షలిచ్చి ఇందరిమ్మ ఇళ్లు కట్టిస్తామని నమ్మబలికినా.. అవి ఇప్పట్లో కాదని తెలిసీ సమయం ఇస్తున్నారు.

కానీ మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ ఇస్తున్నామని తొలిగా ప్రవేశ పెట్టిన ఈ పథకమే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఘోరీ కట్టేలా ఉంది. కొంప ముంచేలా ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు విసిగి వేసారి పోయారు. బస్సు ప్రయాణం చేయాలంటేనే జడుసుకుని ముచ్చెమటలు పట్టే దారుణ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. చాలీచాలని బస్సులతో ఎలాగోలా నెట్టుకొచ్చేద్దామని సర్కార్‌ భావించినా.. అది వారి అంతానికే దారి తీస్తుందని కనీసం ఊహించలేకపోతున్నారు.

చాలా చోట్ల బస్సులు ఆపడం లేదు. గంటల తరబడి నీరిక్షణ తప్పడం లేదు. బస్సుల సంఖ్యపెంచి వారికి సౌకర్యంగా ఈ పథకం మార్చకపోతే.. తాను తవ్వుకున్న గోతిలోనే పడిపోతుంది కాంగ్రెస్‌. మిగిలిన పథకాల హామీల గురించి అడిగి నిలదీసే పరిస్థితులు ఇంకా రాలేదు. కాస్త సమయం ఇద్దామని జనాలు డిసైడ్‌ అయ్యారు. కానీ తొలిగా ప్రవేశ పెట్టిన ఈ పథకం మహిళల ఓపికను పరీక్షించింది. సహనం నశించి శాపనార్ధాలు పెట్టే స్థితికి తెచ్చింది. అసలే పార్లమెంట్‌ ఎన్నికలు మహిళల ఓట్లూ ఎక్కువే. మరి ఈ కోపం కాస్తా ఓట్ల రూపంలో మారితే కాంగ్రెస్‌ పని ఖతమే..!

You missed