కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్ స్వరం పెంచాడు. అడిగిందే తడవు వరాలు కూడా ప్రకటించేస్తున్నాడు. దాదాపుగా అన్ని సభల్ల ఇక ఇదే రిపీట్ కానుంది. మరోవైపు రెండు ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికారేశాడు.
ఎంతకైనా తెగిస్తాం రైతుల కోసం అనే నినాదాన్ని ఈ వేదికగా అందించారు కేసీఆర్. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఒత్తిడి తెస్తే తన ప్రాణం పోయినా పెట్టనని తెగేసి చెప్పిన వైనాన్ని గుర్తు చస్తూ.. అలా చేసినందుకు మోడీ తెలంగాణ రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం చేసి చూపాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాదు.. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ కరోనా వల్ల లేటయిందని చెబుతూనే నోట్ల రద్దు చాలా ఇబ్బందులు పడ్డామని తొలిసారి దీనిపై కేసీఆర్ నోరు విప్పాడు.
బీజేపీని ఇక ఇంత వరకే పరిమితం చేసిన ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డాడు. రెండొందల పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్.. నాలుగు వేలు ఇస్తనంటే నమ్ముతమా… మీరు నమ్మొద్దు.. వాళ్లిచ్చేవాళ్లు కాదు అని మోసగాళ్లని కూడా చెప్పేశారు. మనమూ పింఛన్ పెంచుకుందామని, అక్టోబర్ 16న జరిగే మహాసభలో మ్యానిఫెస్టో ప్రకటిస్తానని అందులో అన్ని వివరంగా చెబుతానని ఆయన పింఛన్ల పెంపు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మూడు గంటల కరెంటు అని రేవంత్ అంటున్నడని .. అది ఎప్పుడైనా ఎవుసం చేసిన ముఖమా అని తీవ్రంగా స్పందించారు కేసీఆర్. రైతుల కోసం ఎన్నో చేశామని, ధరణి కూడా అందులో భాగమేనన్నారు. ధరణి వద్దంటున్న కాంగ్రెస్‌ను బంగాళఖాతంలో విసిరికొట్టాలని పునరుద్ఘాటించారు.
రైతు చనిపోతే కాంగ్రెస్ పాలకులు యాభైవేల పరిహారం ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టి చంపేసేవారంటూ.. వారి మాటలు నమ్మొద్దన్నాడు. కర్ణాటకలో గెలిచి రొమ్ము విరుచుకుంటున్న కాంగ్రెస్ .. అక్కడ పార్టీ గెలుపు కోసం అలవిమాలిన హామీలిచ్చి ఇప్పుడు ఏడు గంటల కరెంటును.. అదీ రెండు పూటల ఇస్తూ మాట తప్పిందని విమర్శించాడు. మెదక్ సభతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. కేసీఆర్ స్వరం కూడా పెరిగింది. బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ప్రధానంగా పింఛన్ల ప్రభావం తమ పార్టీపై పడకుండా గతంలో కాంగ్రెస్ ఎంతిచ్చింది…. ఇప్పుడెలా నాలుగు వేలిస్తుంది..అనే చర్చ ప్రజల మధ్య ఉంచుతున్నారు. బీజేపీని దాదాపుగా లైట్‌గా తీసుకుంటున్న కేసీఆర్.. కాంగ్రెస్‌ను గట్టిగానే అర్సుకుంటున్నారు. ఇక పై ఇదే పంథా కొనసాగనుంది. పనిలోపనిగా వరాల జల్లు కూడా కురిపిస్తున్నాడు జిల్లాలకు.