నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందించారు. ఇప్పుడున్న పాత బస్టాండ్ మూడున్నర ఎకరాల్లో వుంది. మరీ పాత బడింది. తాత్కాలిక మరమ్మతుల తో కొనసాగుతున్నది. స్థలం సరిపోవడం లేదు. ఈ స్థలం ప్రభుత్వానికి అప్పగించి వేరొక చోట కొత్త బస్టాండ్ నిర్మించాలని భావించారు.
రైల్వే స్టేషన్ ను ఆనుకొని వున్న ఐదున్నర ఎకరాల్లో ఈ కొత్త బస్టాండ్ నిర్మిస్తే కావలసిన సౌకర్యాల ఏర్పాటు తో పాటు ప్రయాణికులకు రైల్వే స్టేషన్ ను ఆనుకునే బస్టాండ్ ఉంటే ప్రయాణానికి మరింత సౌలబ్యంగా ఉంటుందని జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇది చాలా కాలంగా పెండింగ్ లో పడింది. బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ అంశాన్ని పలు మార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాత బస్టాండ్ స్థలం ఇచ్చేస్తామని… రైల్వే స్టేషన్ పక్కనే వున్న ఐదున్నర ఎకరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ స్థలం లో ఆర్ అండ్ బీ ఎస్సీ ఆఫీస్, ఈఈ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీస్, పాత ప్రెస్ క్లబ్, ఆర్ అండ్ బీ ఎస్సీ క్యాంపు ఆఫీస్.. తదితర కార్యాలయాలున్నాయి. వీటిని తొలగించి కొత్త బస్టాండ్ ను దాదాపు 55 కోట్లతో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందిస్తున్నారు… ఏడాది లోగా ఇది పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది.