ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ బలం పుంజుకుంటున్నది. దీంతో మొన్న సభలో రాహుల్ వితంతువులు, వృద్ధులకు నాలుగు వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించి వెళ్లిపోగానే ఇదో చర్చ అయ్యింది. చాలా రోజుల తర్వాత తాజాగా సూర్యాపేట బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ కూడా పింఛన్ల పెంపుపై క్లారిటీ ఇచ్చాడు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు.

మనం రెండు వందలున్న పింఛన్‌ను రెండు వేలకుపెంచినం..అంటూ చెప్పుకొచ్చారు. మూడు వేలుగా ఉన్న పింఛన్‌ను నాలుగు వేలు చేస్తామని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలసిందే. సూర్యాపేట సభలో మనం ఇంకా పెంచుతాం.. మ్యానిఫెస్టోలో ప్రకటిస్తాం అని చెప్పగానే ఆశలు పెరిగాయి జనాలకు. ముందే కేసీఆర్‌కు చేతికి ఎముకుండదంటారు. ఆయన పథకాల అమలు తీరు చూస్తే ప్రతిపక్షాలకు కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అలాంటిది పింఛన్‌ పెంచబోతున్నామని చెప్పేసరికి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి జనాల్లో. ఎందకంటే… అత్యధికంగా ఓట్ల శాతం బీఆరెస్‌కు ఆసరా పింఛన్‌ దారులవే. అవే ఆ పార్టీకి శ్రీరామ రక్షగా ఉన్నాయి. మరి అలాంటి ఓటుబ్యాంకును మధ్యలో వచ్చి కాంగ్రెస్‌ కొల్లగొడతానంటే కేసీఆర్ చూస్తూ ఊరుకుంటాడా..? అందుకే ఒక లీక్‌ వదలాడు.

అప్పుడే జనాలు కాంగ్రెస్‌ హామీల పట్ల టెంప్ట్‌ కావొద్దని. కానీ తాజాగా రేవంత్‌రెడ్డి … రాహుల్‌ను మించి మరో ప్రకటన చేశాడు పింఛన్లపై. వింతంతువులు, వృద్ధులే కాదు.. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులు… ఇలా అందరికీ నాలుగు వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించేశాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పెద్దల అనుమతి లేనిదే ఇక్కడి నేతలకు సాధ్యం కాదు. మరి రేవంత్‌ ఇలా ప్రకటన చేయడం వెనుక మతలబేమిటి..? కేసీఆర్‌ వ్యూహాన్ని దెబ్బతీయడం ప్రధాన ఉద్దేశ్యమా..? అధిష్టానాన్ని ఎలాగోలా ఒప్పించవచ్చనా..? ముచ్చటేదైనా.. ఇప్పుడు పింఛన్ల పెంపు ఎంత.. ఎవరెంత..? అనేదే అసలైన చర్చ అయి కూర్చుంది. ఎందుకంటే ఓట్లు పంచే వాటిలో ఈ పింఛన్‌ల పాత్రే ఎక్కువ మరి.

You missed