దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇందూరు వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. సంచలన కామెంట్లు చేశాడు. ఇందూరులో బీజేపీ హవా కొనసాగుతుందని తెలుసుకున్న రేవంత్‌.. తనదైన శైలిలో ప్రజలను ఆ మార్గం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. సున్నితమైన మతపరమైన అంశాన్ని తీసుకుని పరోక్షంగా జనాలను ఆయన హెచ్చరించాడు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని నమ్మితే మన బతుకులు దుర్బరమని నేరుగా చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెలో ఉండాలి.. కానీ బ్యాలెట్‌ బాక్సులో కాదు..’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంటే.. మనమంతా దేవుళ్లను మొక్కుతాం.

ఎవరి మతానుసారం, సంప్రాదాయనుగుణంగా దేవుళ్లను పూజిస్తారు. కానీ బీజేపీ చెప్పినట్టుగా రాముడును మొక్కేవాళ్లంతా, హిందువులంతా బీజేపీకే ఓటేయాలనే వాదనకు ప్రజలను లొంగొద్దని కోరుకుంటూనే… ఓటు రూపంలో వేయడం సరైంది కాదని నేరుగా చెప్పేందుకు ధైర్యం చేశాడు. వాస్తవంగా ఈ అంశం సున్నితమైనదే. ఏమాత్రం బూమరాంగ్‌ అయినా బెడిసి కొడుతుంది. మొన్నటికి మొన్న కేటీఆర్‌ కూడా రాముడిని నమ్మితే కడుపు నిండుతుందా..ఉద్యోగాలొస్తాయా..? అని కామెంట్‌ చేసి నాలుక్కర్చుకున్నాడు. తర్వాత రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అంటూ మాట మార్చి కొత్త నినాదం ఎత్తుకున్నాడు.

ఇప్పుడు రేవంత్‌ కూడా బీజేపీని నిలువరించేందుకు మతం, హిందుత్వం పేరు తీయకతప్పని పరిస్థితి. కానీ ఏమాత్రం జనాలను అవమానపరిచినట్టు, తెలివితక్కువ వారిగా చూసినట్టు ఆ స్పీచులో అంతరార్థం స్పురిస్తే మొదటికే మోసం వస్తుంది. రేవంత్‌ అందుకే ఈ విషయంలో ఆచితూచి మాట్లాడాడు. మోడీ మతాన్నే నమ్ముకున్నాడని, హిందువులు, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టి చలికాచుకుని ఓట్లు దండుకోవాలని, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడని విమర్శించాడు. ఇది రొటీన్‌ స్పీచే. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని చెప్పాడు. ఇదీ రొటీనే. ఇక మిగిలిన స్పీచూ అంతంతే. రుణమాఫీ ఆగస్టు పదిహేను అని ఇక్కడ కూడా ప్రకటించాడు.

ఇక లోకల్ రాజకీయాలకు వస్తే అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అందుకు కవితను వాడుకున్నాడు. కవిత పసుపుబోర్డు తేవడంలో నిర్లక్ష్యం వహించిందని, రైతుల ఆగ్రహానికి బలైందని, రాజకీయంగా ఆమెకు ఇక్కడ సమాధి కట్టేశారని చెబుతూనే.. రేపు అర్వింద్‌కు కూడా కవిత గతే పడుతుందని జోస్యం చెప్పాడు. రైతుజపం బాగనే చేశాడు. జీవన్‌రెడ్డిని రైతులకు ప్రతినిధిగా ప్రకటించేందుకు నానా తంటాలు పడ్డాడు.

 

 

 

 

You missed