వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు విధించి క‌క్ష సాధింపుకు దిగింది. మొన్న‌టి వ‌ర‌కు వానాకాలం సీజ‌న్‌లో వ‌చ్చే రా రైస్ మొత్తం కొంటామ‌ని తెలిపిన కేంద్రం.. దీంట్లోనే కొంత మేర‌కే ప‌రిమితం కావ‌డం.. ఇంకా ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ మంత్రులు ఢిల్లీ బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. అక్క‌డా హామీ లేదు… అపాయింట్‌మెంటూ లేదు.. అన్ని నోటి మాట‌లే.. నీటి మీద రాత‌లే.

ఇప్ప‌టికే యాసంగిలో వ‌రి వేసుకుంటే మాకు సంబంధం లేదు.. మేము బాయిల్డ్ రైస్ తీసుకోబోమ‌ని తేల్చి చెప్పి రాష్ట్రాన్ని మ‌రింత ఇర‌కాటంలో ఇరికించిన కేంద్రం.. తాజాగా వానాకాలం పంట కూడా మొత్తం కొనుగోలు చేసే ప‌రిస్థితిలో లేదు. కేంద్రం ఓ వైపు వ‌రిపై ఆంక్ష‌లు, బియ్యం సేక‌ర‌ణ రాజ‌కీయ కుట్ర‌ల‌కు దిగితే.. దీన్ని ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్రం నిర‌స‌న‌ల పేరుతో రోడ్డెక్కింది. కానీ రైతులు మాత్రం ఈ యాసంగిలో వ‌రి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు వారికి తెలుసు. రోడ్డ‌పైనే ఇంకా ధాన్యం ఉంద‌నీ తెలుసు.. ఇంకా కోత‌లు పూర్తి కాలేదు.. అవి కొంటారా కొన‌రా అనే అనుమాన‌మూ.. భ‌య‌మూ ఉంది.

కానీ యాసంగిలో ఆల్ట‌ర్నేట్ పంట‌ల‌కు మాత్రం పోవ‌డం లేదు. ఎందుకు..? వ‌రి త‌ప్ప వేరే అల‌వాటు లేదు రైతుకు. ఆ భూముల సార‌మూ అలాగే ఉంది. రైతు మెంటాలిటీ దీనికే ముడిప‌డి ఉంది. దీంతో యాసంగిలో రిస్కు తీసుకునేందుకు రైతు రెడీ అవుతున్నాడు. వ‌రి వేసేందుకే మొగ్గు చూపుతున్నాడు. ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతు చేసేది రైతు చేస్తున్నాడు. రాష్ట్రం ఎంత మొత్తుకున్నా కేంద్రం చేసేది కేంద్రం చేస్తున్న‌ది. అన్ని ప‌రణామాల మ‌ధ్య రాష్ట్ర ప్ర‌భుత్వానికే భ‌విష్య‌త్తులో తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితులే ఎదుర‌య్యే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఈ వ‌రి రాజ‌కీయం ఎవ‌రికి ఉరి పెడుతుందో తెలియ‌ని ఆగ‌మ్య‌గోచ‌ర ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏర్ప‌డింది.

You missed