దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

జీవన్‌రెడ్డి మాల్‌ పేరు ఇక తెరమరుగు కానుంది. అధికారం ఉన్నప్పుడు బెదిరించి నడిపించుకున్నాడు జీవన్‌రెడ్డి. రోజులు మారాయి. అధికారం ఊడింది. అప్పుడు ఎగవేసిన బకాయిలు జీవన్‌ మాల్‌, జీవన్‌రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఎట్టకేలకు ఇవాళ జీవన్‌మాల్‌ను స్వాధీనం చేసుకున్నారు ఆర్టీసీ అధికారులు. లీగల్‌గానే ఇదంతా ప్రాసెస్‌ జరిగిందని అధికారికంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించేశాడు. దీంతో ఇదిప్పుడు రాజకీయ చర్చకు తెరతీసింది. అన్నీ కట్టుకుంటూ వచ్చినా ఇంకా రెండు కోట్ల రూపాయల పై చిలుకు ఆర్టీసీకి బకాయి పడ్డాడు. ఇది కూడా చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా జీవన్‌రెడ్డి స్పందించలేదు.

చివరకు గురువారం హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీన్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకున్నది. జీవన్‌మాల్‌కు తాళం పడింది. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అప్పటి నుంచి దీని వెంటే పడ్డాడు. ప్రజల సొమ్మును జీవన్‌రెడ్డి అప్పనంగా వాడుకున్నాడని ఆరోపించాడు. బకాయిల సొమ్ము కట్టాల్సిందేనని వెంటపడ్డ ఎమ్మెల్యే రాకేశ్‌.. ఆ సొమ్ము కూడా తమకే ఇవ్వాలని,ఆర్టీసీని బాగు చేసుకుంటామని ఎండీ సజ్జనార్‌తో పలుమార్లు కలిసి చర్చించాడు. ఇప్పుడు తను అనుకున్నదే జరుగుతున్నది. ఆనాడు చాలెంజ్‌ చేసినట్టు దీన్ని ఆర్టీసీ మాల్‌ చేస్తానని, జీవన్‌రెడ్డి మాల్‌ను పడగొడతానని శపథం చేసి ఇవాళ నిరూపించుకున్నట్టయ్యింది.

అయితే పెండింగ్ బకాయిలు కడితే మళ్లీ జీవన్‌మాల్‌ను జీవన్‌రెడ్డి హస్తగతం చేసుకోవచ్చు. కానీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి యాభై కోట్ల పై చిలుకు రుణం తీసుకుని ఉన్నాడు. దీన్ని వడ్డీ అసలు కలసి చాంతాడంత అయ్యింది. ఈ శకం పూర్తి చేసి జీవన్‌రెడ్డి బయటపడ్దాడనుకున్నా.. ఎస్‌ఎఫ్‌సీ బకాయిలు చెల్లించేదాక వెంటపడి యాక్షన్‌ పెట్టించేందుకు రాకేశ్‌రెడ్డి రంగం సిద్దం చేసుకున్నాడు. ఎలాగైనా దీన్ని ఆర్టీసీ మాల్ చేసి ఆ వచ్చే ఆదాయంతో ఆర్మూర్‌కు అధునాతన సౌకర్యాలతో కూడిన బస్టాండ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నుంచి వచ్చే ఆదాయంతో మరిన్ని రోడ్లు, బస్సులు కొనుగోలు చేసి ఆర్మూర్ ప్రజలకు మరింత సేవ చేయాలనే యోచనలో తానున్నట్టు మీడియాకు చెప్పాడు రాకేశ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed