దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
కవిత తీహార్ జైలు నుంచి కీలక కామెంట్స్ చేశారు. గతంలో ఆమె పలుమార్లు బెయిల్ నిమిత్తం కోర్టుకు వచ్చిన క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మాత్రమే చెప్పారు. కరుడుగట్టిన నేరస్తులను దేశం దాటించి తనకు మాత్రం బెయిల్ ఇవ్వడం లేదని, ఇది ఈడీ కేసు కాదని మోడీ పెట్టిన కేసని ఆమె పలుమార్లు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
కానీ ఇవాళ ఆమె తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. తనను కలవడానికిక వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్కసుమన్‌లతో కవిత మాట్లాడారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన బీజేపీని వదలేది లేదన్నారు.
ప్రజల నుంచి తనను దూరం చేసే ఎత్తుగడ పారదని వ్యాఖ్యానించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో వందకు వంద శాతం రాజకీయ దురుద్దేశమే తప్ప మరోటి లేదన్నారు. వాళ్ల పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండని అధికారులు ఒత్తిడి పెంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అయినా వారి ఒత్తిళ్లకు లొంగేది లేదని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరోలా వ్యవహరిస్తున్నదని ఇది ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటోందన్నారు. తను ధైర్యంగా ఉన్నట్టు ఆమె చెప్పారు.
మానసికంగా తన బలాన్ని ఎవరూ నిర్వీర్యం చేయలేరని కూడా ఆమె స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నానని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి కేసులు పెట్టి తనను భయపెట్టాలని చూస్తున్నారని, తాను భయపడే పరిస్థితే లేదని, తను పులిబిడ్డనని ఆమె అన్నారు. లిక్కర్ కేసు కాదని, అది స్కాం అసలే కాదని, అదొక పాలసీ అని , దాన్ని బూచిగా చూపి తన నైతికత మీద దెబ్బకొట్టే కుట్రను ఎలా ఎదర్కోవాలే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఆమె శపథం చేశారు.