దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రైవేటు ఆస్పత్రుల భరతం పట్టేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి సక్సెసయిన ఆయన… ఇప్పుడు ప్రైవేటు వైద్యరంగంపై సీరియస్‌గా దృష్టి సారించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మెడికవర్‌లో ఇటీవల ఓ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు. ఈ విషయం పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే వైద్యారోగ్య శాఖ అధికారులకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ పర్యవేక్షణలో ఉన్నతాధికారులతో కూడిన విచారణ కమిటీని వేశారు. వీరు నిజనిజాలు నిగ్గు తేల్చనున్నారు. విచారణలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడితే వెంటనే ఆ ఆస్పత్రిని సీజ్‌ చేయడానికి రెడీ అయ్యింది జిల్లా యంత్రాంగం. ఇదిప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యల గుండెల్లో గుబులు రేపుతోంది. ఖలీల్‌వాడీలో గల్లీల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆస్పత్రుల నిర్వహణ, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం, దోపిడీ సర్వసాధరణమై పోయాయి. పిర్యాదులు కొన్నే వస్తున్నాయి. రానివి ఎన్నో ఉన్నాయి. ఈ మెడికవర్ ఆస్పత్రి గతంలో కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నది. మళ్లీ ఇదే ఆస్పత్రితో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కలెక్టర్‌ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

ఇక దీనిపై చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్‌ శాఖను గాడిలో పెట్టే పనిలో పడ్డారాయన. ఆరోగ్య శ్రీలో పేషెంట్ల వద్ద మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నోటీసులు కూడా జారీ చేసింది వైద్యారోగ్యశాఖ. నందిపేటలో ఓ ఔట్‌సోర్సింగ్ మెడికల్‌ ఉద్యోగి ఫోర్జరీ సంతకం చేసి దొరికిపోయాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ అతన్ని టర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మెడికవర్‌ ఇష్యూతో ప్రైవేటు దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇలాంటివి చాలా వచ్చినా డీఎంహెచ్‌వోగా పనిచేసిన సుదర్శనం చూసీ చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కలెక్టరే రంగంలోకి దిగడంతో దగాఖానాల యాజమాన్యాలకు వెన్నులో చలిపుడుతోంది.

You missed