దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుంది. పరనిందకు దిగింది. తన ఓటమికి కారణం బీఆరెస్సే అని బట్టకాల్చి మీదేసింది. బీఆరెస్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని బీజేపీని గెలిపిస్తున్నదని పరోక్షంగా కామెంట్ చేసింది. ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డే. అవును.. ఇవాళ జగిత్యాలలో ఆయనే స్వయంగా ఈ మాటలన్నాడు.
బీఆరెస్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపిని గెలిపిస్తున్నదని పరోక్షంగా ఆయనే ఒప్పుకున్నాడు. మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నదని బీజేపీని విమర్శించాడు జీవన్‌రెడ్డి.
బీజేపీకి ఉన్నదే ఒకే ఒకే అస్త్రం హిందూత్వం. అదందరికీ తెలుసు. అది కాదిక్కడ ముచ్చట. అర్వింద్‌పై ఇక్కడ నిజామాబాద్‌లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సొంత పార్టీలోనే అతని ఓటమిని బలంగా కాంక్షించారు. కానీ కాంగ్రెస్ సమన్వయం లోపం, జీవన్‌రెడ్డి అహంకారం, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పట్టింపులేని తనం, నాయకుల మధ్య కొరవడిన సమన్వయ లేమి అంతా కలిసి గెలిచే కాంగ్రెస్ సీటును గంగలో ముంచాయి.
దీన్ని కాంగ్రెస్ శ్రేణులు గుర్తించారు. అందుకే ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుక్కునే పనిలో పడ్డారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి క్రాస్ ఓటింగ్ గురించి టచ్ చేసి వదిలారు. ఇవాళ ఇదే పాటను జీవన్‌రెడ్డి గట్టిగా అందుకున్నాడు. ఇక మేం ఓడిపోతున్నాం.. బీజేపీ గెలుస్తుందని పరోక్షంగా ఒప్పుకుంటూనే బీఆరెస్‌ను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఆడలేక మద్దెల ఓడు అంటారు ఇదేనేమో..!!