ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని సీఎం కేసీఆర్ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఇన్చార్జిలుగా కవితను నియమించారు. వాస్తవంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మినహా నిజామాబాద్ జిల్లాలో మిగిలిన మూడు స్థానాల్లో పోటీ గట్టిగా ఉంది. ఇక్కడ జాకీలు పెట్టి లేపితే తప్ప పార్టీ గెలుపు తీరాలకు చేరేలా లేదు. దీంతో కవితను కామారెడ్డి జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు.
నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేశారు. ఇందూరుపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆమెను ఇందూరుకే పరిమితం చేశారు. బాల్కొండలో బీఆరెస్ గెలుపు కచ్చితంగా ఉంటుంది. రూరల్ కూడా తిరుగులేదు. ఇక మిగిలిన ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు గెలుపు కష్టంగా ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. ప్రచారమూ మొదలు కాలేదు. కానీ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపుపై మాత్రం తీవ్ర వ్యతిరేక ప్రభావం కొనసాగుతుంది. ఓటమి అంచుల్లో ఉన్నారనే ప్రచారం పీక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో కవితను ఇందూరు జిల్లాకే పరిమితం చేయాలని కేసీఆర్ భావించాడు. కామారెడ్డిలో సీఎం పోటీ చేస్తున్నా.. అక్కడ నేతల గ్రూపుల తగాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
దీంతో కేటీఆర్‌ను రంగలోకి దింపాడు కేసీఆర్. మొన్నటి కార్యకర్తల బహిరంగ సభలో లోకల్ ఎమ్మెల్యేకు, గ్రూపు లీడర్లకు చురకలు అంటించాడు కేటీఆర్. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్తి కాట్‌పల్లి రమణారెడ్డి కేసీఆర్‌ను ఓడిస్తానని, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు కాగితపు లంబాడీలు, ముదిరాజ్‌లు అధికార పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మినహా అంతటా వ్యతిరేక పవనాలు ఉన్నాయి. దీంతో కేటీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ను క్లీన్ స్వీప్ చేసేందుకు చెరో జిల్లాను పంచుకున్నారు అన్నా చెళ్లెలు.