కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు. ఇలాంటి నేత‌లే కదా కావాల్సింది అన్నాడు. ఇంకా సినిమా అయిపోలేద‌ని, ఇంకా చాలా చాలా ఉంద‌ని, ఢిల్లీ పీఠాన్ని దుమ్మురేప‌డ‌మే మిగిలి ఉంద‌ని ముక్తాయించాడు. మున్ముందు బీజేపీని ఇర‌కాటంలో పెట్టి ర‌చ్చర‌చ్చ చేసేందుకు కేసీఆర్ గ‌ట్టి వ్యూహంతోనే ఉన్నాడ‌ని చెప్పిన‌ట్ట‌య్యింది. బండి సంజ‌య్ త‌డిబ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణాల‌పైనా స్పందించాడు. త‌ల‌కు మాసినోడ‌ని దుయ్య‌బ‌ట్టాడు.
యుత్తం చేసేటోడికే క‌త్తి ఇయ్యాల‌ని, నాలుగు తారీఖు త‌ర్వాత ప‌త్తా లేకుండ పారిపోయే బీజేపీకి వెయ్యొద్ద‌న్నాడు. మా వ‌డ్లు కొనండ‌ని ఢిల్లీ రోడ్ల మీద ధ‌ర్నా చేస్తే చాత‌గానీ మోడీ… ఎమ్మెల్యేల‌ను కొనేందుకు మాత్రం సంచుల్లో కోట్లు పెట్టుకుని వ‌స్తున్నాడ‌ని అన్నారు. రెండు సార్లు ప్ర‌ధాని అయిన మోడీ.. ఇంకా ఏం ఆశ ఉంది.. నీకు .. ఇది నీకు త‌గునా..? అని ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారాన్ని దేశ వ్యాప్తంగా ఈ స్పీచ్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు కేసీఆర్.
దేశంలో అంద‌రికీ ఉచిత కరెంటు ఇవ్వ‌డానికి 1.45 ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చ‌వుతుంద‌ని, ఇది చాత‌కాలేదు కానీ… కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు వాళ్లు న‌ష్ట‌పోయార‌నే సాకుతో 14 ల‌క్ష‌ల కోట్లు దారాద‌త్తం చేశాడ‌ని మోడీపై ధ్వ‌జ‌మెత్తాడు. బీఆరెస్ శుభారంభం ఇక్క‌డి నుంచే ఆరంభ‌మ‌ని, ఇదో చారిత్ర‌క విజ‌యంగా నిల‌వ‌బోతుంద‌ని అన్నాడు. పెద్ద స‌ద్ది క‌ట్టి త‌న‌ను ఢిల్లీకి పంపించాల‌ని ఆయ‌న కోరాడు. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం ద్వారా బీజేపీకి చెంప‌పెట్టు స‌మాధానం ఇవ్వాల‌ని, క‌నువిప్పు క‌లిగించాల‌ని కోరాడు.

You missed