మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తి చేసిన కత్తిపోట్లపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. జుక్కల్‌ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బాన్సువాడ సభకు బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ ఘటన వివరాలు తెలియగానే.. బాన్సువాడ సభను వాయిదా వేయాలని ఆయన భావించారు. అక్కడి నుంచే ఆయన ఫోన్లో మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాలకు హానీ లేదని తెలుసుకున్న తరువాత ఆయన బాన్సువాడ సభకు వచ్చారు. అన్యమనస్కంగానే మాట్లాడారు.

తనకీ రోజు చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి ప్రభాకర్‌రెడ్డిపైన కాదని, తనపైనేనని కేసీఆర్‌ భావోద్వేగంగా మాట్లాడారు. చేతగాని దద్దమ్మలు, వెధవలు ఇలాంటి పనులు చేస్తారని, ఇన్నేండ్ల పాటు ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని, కానీ సహనం కోల్పోయిన ప్రతిపక్షాలు ఇలా హత్యలకు, హింసకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని, తమకు కత్తులు పట్టడం వచ్చన్నారు. అదే పని తాముగనుకు చేస్తే రాష్ట్రం దుమ్ముదుమ్ము అవుతుందని ఆయన హెచ్చరించారు. కానీ తమకు ప్రజలు ఎంతో బాధ్యతను భుజస్కంధాలపై పెట్టారని, వారికి సేవ చేసేందుకే అహర్నిశలు తాము ఆలోచిస్తుంటామని అన్నారు సీఎం కేసీఆర్‌. రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఇలా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, దీనిని అహింసావాదులు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతామని ఆయన ఈ వేదికగా హెచ్చరించారు. చేతగాని దద్దమ్మలు, వెధవలే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతారని ఆయన విమర్శించారు.

You missed