మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. ఇది కాంగ్రెస్‌ పార్టీ చేసిందనేనని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మలు ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, ఓటు హక్కుతో వీరికి బుద్ది చెప్పి కళ్లు తెరిపించాలని ఆయన నారాయణఖేడ్‌ సభలో పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సభలో మాట్లాడే సమయంలో ఆయన ఈ ఘటనను ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ మాట్లాడారు. పార్టీ పేరు తీయలేదు.

కానీ నారాయణఖేడ్‌ సభలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారాయన. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మలు చేయించిన పనేనంటూ రెండు పర్యాయలు ఆయన తన ప్రసంగంలో తిట్టిపోశారు. ఇన్నేండ్ల పాటు బీఆరెస్‌ పార్టీ న్యాయబద్దంగా, ధర్మబద్దంగా పాలన చేసిందని, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా ప్రజలకు కాపాడుకున్నామని, ఇది ఓర్వక, కండ్లు మండి కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి దారుణాలకు ఒడిగడ్తుందంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. గెలవక చాతగాక హింసకు తెగబడుతున్నారంటూ దుయ్యబట్టారు.