పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని చేత పసుపు బోర్డుపై ప్రకటన చేయిస్తారా..? గతంలో ఎన్నికల ముందు రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు హామీ ఇచ్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఏమో నాకేమీ తెలియద’ని తెల్లముఖమేశాడు కిషన్‌రెడ్డి. అసలు పసుపుబోర్డు అంశమే తన నోటీసులో లేదనే విధంగా తప్పించుకునే దోరణిలో మాట్లాడాడు. ‘ఏమో మా వాళ్లతో మాట్లాడి చెబుతా’ అన్నాడు చివరగా.

గత కొద్ది రోజులుగా జిల్లాలో ఇదో చర్చ కొనసాగుతోంది. మోడీ చేత పసుపుబోర్డు ప్రకటన చేయిస్తారంటూ. కానీ అసాధ్యమని కేంద్రమే తేల్చి చెప్పిన నేపథ్యంలో… మరోవైపు ఇప్పుడు స్వయంగా మోడీ చెప్పినా నమ్మని రైతులు, జనం మధ్య ఈ ఇష్యూ బీజేపీ మెడకు చుట్టుకోనుంది. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపమన్నట్టు పసుపుబోర్డు విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది ఆ పార్టీకి. ఓ వైపు ఎమ్మెల్సీ కవిత తదితరులు పీఎం రాక నేపథ్యంలో బీజేపీని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు ఇదే విషయంపై. పసుపు బోర్డుపై ప్రకటన చేసి రావాలని. కానీ కిషన్‌ రెడ్డి మాత్రం ఈ విషయమే తనకు తెలియదన్నట్టుగా ముఖం తిప్పుకోవడం చర్చకు తెరతీసింది. పీఎం సభ నేపథ్యం ఇందూరు రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.

You missed