కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత జ్ఞానం. ఇదేనా మీ మేధోస్థాయి?? నా వరకు వస్తే తప్ప పట్టించుకోకపోవడం మేధావి లక్షణమా? ఎక్కడో అమెరికా దాడులు జరిపితే ఊరేగింపులు తీస్తారు. కర్ణాటకలోనో, మరెక్కడో ఎవరో కవిని మతశక్తులు హత్య చేశాయని గగ్గోలు పెడతారు. ఎన్టీఆర్‌ను గద్దె దించితే లెఫ్టు రైటూ తేడా లేకుండా తమ పోషకుల సంతృప్తి కోసం ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. మరి ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకులపై వేధింపులు సాగుతుంటే మొద్దు నిద్ర పోతుంటారు. రాష్ట్ర సరిహద్దు ఆవల నుంచి ఇషారా వస్తే తప్ప వీరి గుండె స్పందించదు.

పరాయి పోషిత మేధావులు సరే, నిలయ విద్వాంసుల సంగతేమిటట! ఉద్యమకారుల ముసుగేసుకొని టీఆరెస్‌ ప్రభుత్వంలో తిష్టవేసిన పెద్దల సంగతేమిటి? ఒకరిద్దరు మొహమాటం కొద్దీ, ఇంకా పైపై పెదవులపై ఆశ కొద్దీ కొంచెం మూలిగినట్టున్నారు. కానీ వీరంతా ప్రజాసంఘాలతో మమేమకమైన వారే. తలా నలుగురితో ప్రకటనలు ఇప్పించలేరా? నాలుగు సమావేశాలు జరపలేరా? ఇవన్నీ చేయగలరు. కానీ చేయరు! చేయడం లేదు. మరి ఆస్థాన సంపాదకుల వారు ఏమి చేస్తున్నట్టు? కాఫీ న్యూస్‌ కోసం తెచ్చిపెట్టుకున్న మేస్త్రీ గారు ఏమి చేస్తున్నట్టు? గోడకు పిడకలు కొట్టినట్టు నాలుగు అనుకూల వార్తలు వేయడమే వీరిపనా? వారు అదే అనుకుంటున్నారు. యాజమాన్యాలు కూడా అదే భ్రమలో ఉన్నాయి.

టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..

ఉద్యమకారులు, మేధావులలో ఎంతో మంది నిజాయితీపరులు, ప్రతిభావంతులు ఉన్నారు. కానీ టీఆరెస్‌ నాయకత్వం వారిని ఏనాడూ కండ్ల కానలేదు. ప్రత్యర్థి శిబిరం వారు పంపించిన అద్దె గుర్రాలపైనే వారు నమ్మకం పెట్టుకున్నారు. తినేది మొగడి సొమ్ము, పాడేది మిండల పాట అన్నట్టు – వీరు ఏనాడూ టీఆరెస్‌ శ్రేయోభిలాషులు కాదు. తెలంగాణ ఉద్యమకాలంలో బలహీనపడిన చంద్రబాబు అనుకూల ప్రజాసంఘాలు, మేధావులను మళ్లీ బలోపేతం చేయడంలో వీరిది ప్రధానపాత్ర. ప్రభుత్వంలో ఉంటూనే తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న వారిలో, ఉపాధ్యాయులలో, ఉద్యోగులలో, ఇతర వర్గాలలో అసంతృప్తిని రగిలించడంలో వీరు ఇప్పటికే విజయం సాధించారు. టీఆరెస్‌ అభిమానులు ఎక్కడ ఉన్నా తొక్కిపారేయడమే వీరి పని.

ఇప్పుడు కేసీఆర్‌ ఆదేశిస్తే తప్పనిసరైతే, చిన్నగా మూలుగుతారు. అంతేతప్ప టీఆరెస్‌కు లేదా తెలంగాణకు ఇప్పుడు వీరు విధేయులు కారు. ఇప్పుడు కవిత విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా అంతే. భవిష్యత్తులో కేసీఆర్‌- టీఆరెస్‌ దెబ్బతినడమే వారు కోరుకుంటున్నది. అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

You missed