కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ఇది కొంతమంది అమాయకులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇందులో ఎటువంటి సందిగ్ధానికి, సందేహాలకు తావు లేదు. కవితను కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం వేధిస్తున్నదనేది వాస్తవం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యతిరేక పోరాటం జరుపుతున్నదా? ఈ అవినీతి నిర్మూలన కార్యక్రమంలో భాగంగానే కవితపై సీబీఐ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయా..? ఇందుకు సమాధానం సులభమైంది. మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక కార్యక్రమాన్ని ఏదీ చేపట్టలేదు. పైగా అవినీతిపరులకు బాసటగా నిలిచింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అవినీతి పుట్టలుగా మారిపోయాయి. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు కుంభకోణాలకు కేంద్ర బిందువులుగా ఉన్నారు. కానీ వారి మీద ఈగ కూడా వాలడం లేదు. కర్ణాటకలో అవినీతిపరుడైన మంత్రి ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్టరు బిల్లులు ఇవ్వడానికి మంత్రి నలభై శాతం కమీషన్‌ అడిగాడనేది ఆరోపణ! మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్‌ కుంభకోణం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. ఇది మామూలు కుంభకోణం మాత్రమే కాదు. ఈ కుంభకోణం బయట పెట్టిన వారిని, సాక్షులను కనీసం నలభై మందిని హత్య చేశారు. అయినా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది! అస్సాం, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా , గుజరాత్‌, ఉత్తరాఖండ్‌- ఇలా రాష్ట్రాల వారీగా బీజేపీ నేతల అవినీతి, చట్టాల ఉల్లంఘనల జాబితా తయారు చేస్తే చేంతాడంత అవుతుంది. బ్యాంకులను నిలువునా ముంచినవారు, అక్రమాలకు పాల్పడిన వ్యాపారస్తులు దేశం విడిచి దర్జాగా పోయినా మోదీ ప్రభుత్వం వారికి సహకరించిందే తప్ప చేసిందేమీ లేదు.
దీనిని బట్టి చూస్తే మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోరాటం జరపడం లేదని, అవినీతి పరులకు రక్షణ కల్పిస్తున్నదని స్పష్టమవుతున్నది. మరి కవితపై ఈ ఆరోపణలు , వేధింపులు ఎందుకు..?

ఇందుకు రెండు కారణాలు చెప్పవచ్చు. మొదటిది- కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామిక శక్తులను అణచివేయాలని చూస్తున్నది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే పార్టీ మొదలైన నిరంకుశ పాలనలతో, భారతీయ సమాజంలోని భిన్నత్వాన్ని నలిపివేయాలని చూస్తున్నది. దేశంలో సమాఖ్యతత్వం ఉండకూడదు. ప్రాంతీయ శక్తులు ఎదగవద్దు. అంతా ఢిల్లీ ప్రభువుల ఏకఛత్రాధిపత్యంలో సాగాలి. ఇందులో భాగంగా దేశంలోని అన్ని పార్టీలను అణచివేస్తున్నది. బీజేపీయేతర పక్షాల నాయకులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్రీయ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ వేధిస్తున్నది. ఇదంతా మన కండ్లముందే కనిపిస్తున్నది. ఇందులో సందేహాలకు తావులేదు. రెండవ కారణం- తెలంగాణలో టీఆరెస్‌ ప్రబల శక్తిగా ఎదిగింది. బీజేపీ ఫాసిస్టు రాజకీయాలను ఎదిరిస్తున్నది. కేసీఆర్‌ వంటి నాయకుడు ఉంటే బీజేపీ దక్షిణాదిలో అడుగుపెట్టలేదు సరికదా.. ఉత్తర భారతంలో కూడా తుడిచి పెట్టుకుపోతుంది. బీజేపీయేతర పార్టీలకు ఒక ఇరుసుగా టీఆరెస్‌ మారుతున్నది. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆరెస్‌ ఏర్పాటయ్యింది. ఇదంతా కూడా కండ్ల ముందు కనిపిస్తున్నది.

దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, వేధింపులలో భాగంగానే టీఆరెస్‌ అనుకూల వ్యక్తులపై, సంస్థలపై దాడులు సాగుతున్నాయి. ఉద్యమకారులపై, రాజకీయ ప్రత్యర్థులపై దొంగతనం, చీటింగుతో సహా అనేక చవకబారు కేసులు బనాయించడం మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ఫలానా వారు ప్రజల పక్షాన నిలబడ్డారు, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు.. రాజ్యాంగ పరిరక్షణ కోరుతున్నారు.. ప్రాంతీయ ఆకాంక్షలకు పట్టంగడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై కేసులు పెడతారా? బోగస్‌ కేసులేవో బనాయించి అరెస్టులు చేస్తారు. జైలులో పెడతారు. నిరంతరం వేధిస్తారు. వెంటాడుతారు.

కవితపై ముందుకు తెచ్చిన ఆరోపణలు కూడా నిరాధారమైనవి. చవకబారువే. ఇవేవీ నిజాయితీగా సాగే విచారణకు నిలువవు. కానీ ప్రత్యర్థులను వేధించడానికి, ప్రజల ఆకాంక్షలను అణచివేయడానికి ఉపయోగించాలని నిరంకుశులు చూస్తారు. కవిత విషయంలోనూ జరుగుతున్నది ఇదే.

కవిత సాధారణ నాయకురాలు కాదు. ప్రజాస్వామ్య భావాలు గల ఉద్యమకారిణి. మహిళలు, అట్టడుగు వర్గాల ప్రయోజనాల పట్ల పట్టింపు ఎక్కువ. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి చూపుతారు. ఈ విషయంలో ఆమెకు దేశవ్యాప్త గుర్తింపు ఉన్నది. వివిధ అంశాల పట్ల లోతైన అవగాహన, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ప్రావీణ్యం, వాక్చాతుర్యం, కలుపుగోలుతనం ఉన్న మహిళానేత. అందుకే ఫాసిస్టు శక్తుల ఆగ్రహం ఆమెపై కేంద్రీకృతమైంది.

ప్రత్యర్థులను మానసికంగా బలహీనపరచాలని ఫాసిస్టు శక్తులు భావిస్తాయి. అందుకే కేసీఆర్‌ దెబ్బకొట్టడానికి మహిళ అయిన కవితను ఏదో ఒక కేసులో ఇరికించి వేధించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నది. లిక్కర్‌ వ్యవహారంలో ఇరికించాలనుకోవడం కూడా వారి దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. మహిళపై ఇటువంటి ఇబ్బందికరమైన కేసు బనాయించి ఇబ్బంది పెట్టడం వారి కుసంస్కారానికి ఉదాహరణ. ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా దిగజారుడు ఆరోపణలు చేస్తూనే , మరోవైపు స్థానిక బీజేపీ నేతల చేత మహిళలు ఇబ్బందిపడేటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. దీనిని బట్టి ఫాసిస్టు శక్తులు ఎంతగా దిగజారి ప్రజా నాయకులను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయో తెలిసిపోతున్నది.

కవితపై వచ్చిన ఆరోపణలను ప్రజాస్వామ్యవాదులంతా తిప్పికొట్టాలి. ఫాసిస్టుల కుటిల యత్నాలను ఎండగట్టాలి. కవితకు అండగా నిలబడటం అంటే , ఒక వ్యక్తిని లేదా రాజకీయ నాయకురాలిని కాపాడుకోవడం కాదు. ఫాసిస్టు దాడుల నుంచి దేశాన్ని రక్షించడం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం. మనలను మనం కాపాడుకోవడం. మన పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చుకోవడం. కవితపై ఆరోపణలను, వేధింపులను ఉపసంహరించుకునే వరకు ప్రజాస్వామ్య కోవిదులు ఉద్యమం సాగించాలి. ఏ కవితనైతే ఫాసిస్టు శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయో, ఆ కవిత కేంద్రంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సాగాలి. దీనిని దేశ వ్యాప్త ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంగా మార్చాలి. ఇందుకు కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య కోవిదులు, రాజకీయ పక్షాలు సమిష్టిగా కదిలి సాగాలి. ఇది ఒక కవితకు లేదా టీఆరెస్‌కు సంబంధించిన వ్యవహారం అని భావిస్తే , రేపు మనందరి హక్కులకు భంగం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థనే పతనమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.

నివాస్‌

You missed