ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కీలకం కానుంది. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత ఏడాది 2.56 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్‌ ఈ సారి మరో 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. గత ఎనిమిదేండ్లుగా బడ్జెట్‌ తీరును పరిశీలిస్తే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా.. 15 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మొదట 2014-15 లో పూర్తి సంవత్సరం బడ్జెట్‌ కాకపోయినప్పటికీ లక్ష కోట్ల బడ్జెట్‌ను పదినెలల కోసం ప్రవేశ పెట్టారు. ఆ మరుసటి సంవత్సరం 1.16 లక్షల కోట్లు, ఆ తర్వాత ఏడాది కోసం 1.26 కోట్లు, ఆ తర్వాత 1.43 కోట్లు, ఆ తర్వాత 1.64 లక్షల కోట్లు, 1.83 లక్షల కోట్లు, 2.16 లక్షల కోట్లు, 2.56 లక్షల కోట్లు… ఇలా పదిహేను నుంచి ఇరవై శాతం పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి ఎన్నికలున్న తరుణంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది దళిత బంధుకు 17వేల కోట్లు కేటాయించారు. ఈసారి ఆ మొత్తాన్ని పెంచుతారా..? చూడాలి. మరోవైపు గిరిజన బంధు కూడా సీఎం ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. గిరిజన బంధుకు కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ వ్యయం దాదాపు 90శాతం దాటవచ్చనేది అంచనాలు. అభివృద్ధికి, మౌళిక సదుపాయాలకు, ప్రాజెక్టులకు కేటాయించే బాగా తగ్గవచ్చని, క్యాపిటల్‌ ఎక్స్పెండేచర్‌ ఈసారి 10 శాతం లోపే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పులు చేసే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే పరిమితి మించి అప్పులు చేసింది. గతంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారుతుందని విమర్శలొస్తున్న తరుణంలో దీనిని కట్టడి చేసే అవకాశం కనిపించడం లేదు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కొంత నయమే ఉన్నప్పటికీ.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 20 శాతం లోపుండాలన్న లక్ష్మణరేఖను దాటిపోతున్నది. ఈ కారణంగా కేంద్రం కూడా అప్పులు ఎక్కువ తీసుకోనియకుండా కట్టడి చేస్తున్నది. 50 వేల కోట్లు కనీసం రావాలని రాష్ట్రం కోరుతున్నా..35 వేల కోట్లకు మాత్రమే అనుమితి పరిమితం చేస్తున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ౩ శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే వాటాలు మాత్రం పెరగడం లేదు. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడుల్లో 15 నుంచి 20 శాతం వృద్ధి రేటు కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా బడ్జెట్‌ను పెంచుతూ పోతున్నది. సొంత రాబడే పెరుగుతుంది తప్ప కేంద్రం రాబడి పెరగడం లేదు. పన్నేతర రాబడీ పెరగడం లేదు. మరోవైపు గ్రాంట్లూ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ పెద్ద సవాలుగానే మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతున్నా..సవరించిన అంచనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. బడ్జెట్‌ కంటే 15-20 శాతం తగ్గించుకోవాల్సి వస్తున్నది. ఈసారీ భారీగా ప్రవేశపెడితే మళ్లీ ఎంత సవరించుకోవాల్సి వస్తుంది..? అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతుల్యత కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. మొత్తానికి ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సవాలుగానే ఉండబోతుంది.

బడ్జెట్‌ కోసం ఇంకా పూర్తి వివరాలను సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ మైక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో…..

You missed