సెప్టెంబ‌ర్ 17…ఇదెప్పుడూ ఓ అయోమ‌యం అంద‌రికీ. ఓ చ‌ర్చ‌కు నాంది. ఎవ‌రికి వారే చెప్పుకునే ఓ నిర్వ‌చ‌నం. విలీనం, విద్రోహం, విమోచ‌న‌… ఇవ‌న్నీ మొన్న‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో నానుతూ వ‌చ్చిన పేర్లు. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌భుత్వం దీనికి స‌మైక్య‌త అని కూడా పేరు పెట్టింది. ఇంకొంద‌రు దీన్ని బ్లాక్ డేగా కూడా చెప్పుకుంటారు. భావి తరానికి ఇదో పెద్ద అయోమ‌య చ‌రిత్ర‌గానే మిగిలిపోతున్న‌ది. అస‌లే తెలంగాణ చ‌రిత్ర పాఠ్య‌పుస్త‌కాల్లో ఎక్కింది అంతంత మాత్ర‌మే. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన నాడు మ‌న‌కు రాలేదు.. మ‌నం ప్ర‌త్యేక దేశంగా, నిజాం ప‌రిపాల‌న‌లో ఉన్నామ‌నే విష‌యం ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌దు. నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా సాయుధ పోరాటం జ‌రిగింది. ఇది చ‌రిత్ర‌.

నిజాం పాల‌న‌ను నుంచి విముక్తి కోరుకున్నారు. ఇది చ‌రిత్ర‌. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌ను విలీనం చేసుకోవాల‌ని అనుకున్నారు. నిజాం విన‌లేదు. యుద్దానికి సిద్ద‌మ‌య్యారు. ఈ ప‌రిణామ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు నిజాం లొంగాడు. విలీనం జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు రాచ‌రిక పాల‌న‌లో ఉన్నాం కాబ‌ట్టి ఇది విలీనం అన్నారు. కాదు.. నిజాం నిరంకుశ పాల‌న నుంచి విముక్తి అయ్యాం కాబ‌ట్టి మ‌న‌కు ఇది విమోచ‌న అన్నారు. కాదు.. కాదు… మ‌న‌ది ప్ర‌త్యేక దేశం.. ఒక‌వేళ భార‌త‌దేశంలో క‌లుపుకోక‌పోతే మ‌న‌మే ఓ దేశంగా విల‌సిల్లుతుంటిమి.. అందుకే ఇది విద్రోహం అన్నారు. ఇది మ‌న‌కు బ్లాక్‌డేగా అభివ‌ర్ణికంచారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా విమోచ‌నే ప్ర‌ధాన అస్త్రంగా ప‌నిచేసింది. ఇదంతా అప్ప‌టి అవ‌స‌రాల కోసం. ఇప్పుడు ఇది మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టే ఓ అంశంగా మారింది. అందుకే విమోచ‌న అనే ప‌దం వాడ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అనుకున్నారు లౌకిక వాదులు, ప్ర‌జాస్వామ్య‌వాదులు. టీఆరెస్ ప్ర‌భుత్వ‌మూ అదే దోర‌ణిలో ఆలోచించింది సహ‌జంగానే. అందుకే ఇప్పుడు ఇది స‌మైక్య‌తా దినోత్స‌వంగా మారింది. ఈ చ‌రిత్ర వెనుక ఇంత క‌థ ఉంది. ఎవ‌రికి వారే ఎవ‌రి అస‌వ‌రాల‌కు త‌గ్గ‌ట్టు వారు పిలుచుకునే వేదిక ఈ రోజు. భావిత‌రాల‌కు అయోమ‌య చ‌రిత్ర‌ను మిగిల్చే ప్ర‌త్యేక‌మైన రోజిది.

You missed