ఉత్త‌ర తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఉన్న మున్నూరుకాపులు టీఆరెస్‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. కేసీఆర్ త‌మ‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టేశాడ‌ని, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నే భావ‌న ఆ కులంలో బ‌లంగా రోజు రోజుకు పాతుకుపోతున్న‌ది. ఇది బీజేపీకి ఆయువు ప‌ట్టుగా మారుతున్న‌ది. అర్వింద్‌, బండి సంజ‌య్‌లిద్ద‌రూ ఈ ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటూ వ‌స్తున్నారు.

  • బీజేపీని బ‌లోపేతం చేసేందుకు మున్నూరుకాపుల ఐక్య‌త‌ను త‌మ పార్టీకి స‌పోర్టుగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లోని ఉమ్మ‌డి నిజామాబాద్‌, ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మున్నూరుకాపులు బ‌లంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపును ప్ర‌భావితం చేసే బ‌లం ఉంది వీళ్ల‌కు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి మున్నూరుకాపుల‌తో పాటు గౌండ్లు, కుర్మ‌యాద‌వులు, ప‌ద్మ‌శాలీలు, గంగ‌పుత్రులు, ముదిరాజుల స‌పోర్టు ఉంది.
  • కానీ ఇందులో రాజ‌కీయంగా బ‌లంగా ముందు వ‌రుసలో ఉన్న కులాలు మున్నూరుకాపులు, గౌండ్లే. తెలంగాణ ఉద్య‌మం నాటి నుంచి రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు మున్నూరుకాపులు కేసీఆర్ వైపే ఉన్నారు. కే కేశ‌వ‌రావు, బొంతు రామ్మోహ‌న్‌, విన‌య్ భాస్క‌ర్, జోగు రామ‌న్న … ఇలా చాలా మంది కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. విఠ‌ల్‌ను టీఎస్ పీఎస్సీ మెంబ‌ర్‌గా చేశాడు. ఈ త‌ర్వాతే మెల్ల మెల్ల‌గా ఈ సామాజిక‌వ‌ర్గాన్ని కేసీఆర్ విస్మ‌రిస్తున్నాడ‌నే భావ‌న పెర‌గ‌సాగింది.
  • అన్ని కులాల‌కు కుల‌భ‌వ‌నాలు క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. ఈ మున్నూరుకాపు కులానికి సంబంధించి మాత్రం చివ‌ర‌లో నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇది కూడా ఆ కులంలో అసంతృప్తికి కార‌ణ‌మైంది. అర్వింద్ రాజ‌కీయ ఎంట్రీతో అనూహ్యంగా ఎంపీగా క‌విత‌ను ఓడ‌గొట్ట‌డంలో మున్నూరుకాపులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అక్క‌డ క‌రీంన‌గ‌ర్‌లో ఎంపీగా బండిసంజ‌య్‌ను గెలిపించి.. కేసీఆర్ కుటుంబ స‌భ్యుడైన బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ ను ఓడ‌గొట్టారు.
  • తీన్మార్ మ‌ల్ల‌న్న మొద‌ట బీఎస్పీలో చేరదామ‌నుకున్నాడు. జైలుకు పోయిన త‌ర్వాత అర్వింద్ చ‌క్రం తిప్పి బీజేపీలోకి లాగాడు. త‌న‌కు బీజేపీ అవ‌స‌రం అనివార్య‌మైంది. గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠం రెండు సార్లు మున్నూరుకాపుల‌కు ఇచ్చినా…. ఆర్టీసీ చైర్మ‌న్‌గా బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ను నియ‌మించినా.. ఆ కులంలో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌ట్ల అసంతృప్తి పోలేదు.
  • విఠ‌ల్ కూడా ఈ మ‌ధ్యే బీజేపీలో చేరాడు. బీజేపీ ఈ కాపుల ఐక్య‌త‌ను త‌న ఖాతాలో వేసుకుని మ‌రింత బ‌లం ప్రోదీ చేసుకోవాల‌ని చూస్తున్న‌ది. అర్వింద్‌, బండి సంజ‌య్‌లిద్ద‌రూ ఈ ఆప‌రేషన్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

+

By admin

You missed