టీఆరెఎస్ ఇక ఫక్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచి ఉద్య‌మం, ఉద్య‌మ‌కారుల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. పార్టీ ఎదుగుద‌ల‌, ప్ర‌భుత్వ సుస్థిర‌త ఇవే ఆయ‌న‌కు రెండు క‌ళ్లు. ఉద్య‌మ‌కారుల‌ను కాద‌ని చాలా మంది ఉద్య‌మ ద్రోహుల‌కు ఆయ‌న ప‌ద‌వులిచ్చాడు. ‘రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ’ అని దానికి అంద‌మైన పేరు కూడా పెట్టాడు. ‘మేమూ ఉద్య‌మం చేశాం.. జైలుకు పోయివ‌చ్చాం’ అని చెప్పుకున్నావాళ్లంతా ఎక్కడ్నో మ‌రుగున ప‌డిపోయారు. వాళ్ల గురించి ఆలోచ‌న లేదు? ధ్యాస లేదు? వారికి కేసీఆర్ పైన ఆశా లేదు. కానీ, ఉన్న‌ప‌లంగా, ఆక‌స్మాత్తుగా మ‌ళ్లీ ఉద్యమం, ఉద్య‌మ‌కారుల ప్రస్తావ‌న ఒక్క‌సారిగా తెర పైకి వ‌చ్చింది. దీనికి ఈట‌ల రాజేంద‌రే కార‌ణం. హుజురాబాద్ ఉప ఎన్నికే దోహదం.

స‌మ‌యం, సంద‌ర్భాన్ని బట్టి అందుక‌నుగుణంగా ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాలు తీసుకోవ‌డం కేసీఆర్‌కు అల‌వాటు. ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎదుర్కొనేందుకు ఆయ‌న అన్ని స‌మీక‌ర‌ణ‌ల‌ను స‌మీక్షించాడు. ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌లేదు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ఎంపిక వెనుక భారీ క‌స‌ర‌త్తే జ‌రిగింది. ఓయూ ఉద్య‌మ‌నేత‌, యువ‌కుడు, స్థానికుడు, బీసీ.. ఇవ‌న్నీ గెల్లుకు క‌లిసొచ్చాయి. అన్నింటిక‌న్నా ముఖ్యంగా కేసీఆర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌వి ఉద్య‌మ‌కారుడు, బీసీ అనే కార్డు.

అయితే గెల్లు ఉద్య‌మ‌కారుడ‌నే విష‌యాన్ని ప్రొజెక్ట్ చేసే విష‌యంలో టీఆరెఎస్ సోష‌ల్ మీడియా అపసోపాలు ప‌డుతున్న‌ది. ఎందుకంటే ఈట‌లకు ఉద్య‌మ‌కారుడిగా ఇంకా గుర్తింపు ఉన్న‌ది. అందుకే గెల్లును కూడా పెద్ద ఉద్య‌మ‌కారుడిగా చిత్రీక‌రించేందుకు తంటాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆరెఎస్ సోష‌ల్ మీడియా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ఉద్య‌మ కాలం నాటి ఫోటోల‌ను బ‌య‌ట‌కు తీసి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న‌ది. ఉద్య‌మ‌కారుడికి స‌ముచిత స్థానం ద‌క్కింద‌ని కీర్తిస్తున్న‌ది. ఓ ఉద్య‌మ‌కారుడు త్వ‌ర‌లో ఎమ్మెల్యేగా శాస‌న‌స‌భ‌లో అడుగు పెట్ట‌బోతున్నాడ‌ని జోష్యం కూడా చెబుతున్న‌ది.

ఇది చూసి జిల్లాల్లోని మ‌న ఉద్య‌మ‌కారులంతా త‌మ పాత ఫోటో ఆల్బ‌మ్‌ను దుమ్ము దులుపుతున్నారు. ‘సారు..! మేము ఉద్యమంలో ఉన్నాము.. మ‌మ్ముల్ని మ‌ర‌వ‌కండి.. ఎమ్మెల్యే సీటు కాకున్నా ఏదైనా చిన్నా చితక ప‌ద‌వైనా ఇవ్వండి..’ అని అభ్య‌ర్ధించేందుకు రెడీ అవుతున్నారు. కానీ పాపం వారికి తెలియ‌దు. వారి అభ్య‌ర్థ‌న అర‌ణ్య రోద‌నేన‌ని. ఇది హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స్టంటేన‌ని. అక్క‌డ పార్టీ అవ‌స‌రం రీత్యా, ప్ర‌తికూల ప‌రిస్థితుల రీత్యా గెల్లు అవ‌స‌రం వ‌చ్చిందని. స‌రే, మీరు చేసేందేముంది? మీ ప్ర‌య‌త్నం మీరు చేయండి.. పాత ఫోటోల ఆల్బ‌మ్‌ల దుమ్మును దుల‌పండి. కేసీఆర్‌కు గుర్తు చేయండి. ఇన్నేండ్లు ఓపిక ప‌ట్టారు.. ఇక కొన్నేండ్లు ఓపిక ప‌ట్ట‌లేరా.. ఓ ఉద్య‌మ‌కారులారా?
Wait and see

You missed