సర్కారు పై మెల్లమెల్లగా ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతూ వస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, కొత్త హామీలు ఎన్నికల నేపథ్యంలోనే ప్రకటించి ఆపై అమలు పరచకపోవడం, నిరుద్యోగ సమస్య తదితర కారణాలు సర్కారును సంకటంలో పడేస్తున్నాయి. నిరుద్యోగ సమస్య మరీ తీవ్రంగా ఉంది. నోటిఫికేషన్లు లేక చాలా రోజులవుతుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రకటన పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతూ వస్తున్నది.
గతంలో ఇన్ని ఉద్యోగాలిచ్చాం అని గొప్పగా లెక్కలు చెప్పుకోవడానికే సర్కారు సరిపోతున్నది. ఈ లెక్కల మాటలు వినీవినీ జనాలు విసుగెత్తి పోయారు. ఓ దశలో ఈ సర్కారులో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం గగనమే అనే ఆలోచనలు వచ్చాయి. వైరాగ్యంలో రగిలిపోతున్నారు. ప్రతిపక్షాలు సైతం నిరుద్యోగ సమస్య పై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంలో విఫలమయ్యాయి. కాగా బీజేపీ అనుబంధ యువజన సంఘం బీజేవైఎం నిరుద్యోగ సమస్య పై ఈ మధ్య కాలంలో పలు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో వివిధ రకాల ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ సమస్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవుల కాన్వాయ్‌లను బీజేవైఎం అడ్డుకోవడం కలకలం రేపింది. మరో వైపు హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ నేతలకూ నిరుద్యోగ సెగ తగులుతోన్నది.
మొన్న హరీశ్‌ను ఓ మహిళ నిలదీసింది. దీని పై ఏవేవో కాకీ లెక్కలు చెప్పిన మంత్రి.. త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని మాట చెప్పి తప్పించుకున్నాడు. ఇలాంటి మాటలు వినీవినీ జనాలు విసుగెత్తిపోయి ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని పలుమార్లు రాజకీయ అవసరాల కోసం ప్రకటనలు ఇస్తూ ఆ తర్వాత విస్మరిస్తూ వస్తున్నారు. హుజురాబాద్ ఎన్నకల్లో ఈ నిరుద్యోగ సమస్య కూడా ఇబ్బంది కరంగా మారింది.
