కేసీఆర్ మ‌దిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక స‌మీక‌ర‌ణ‌లు ముడిప‌డి ఉంటాయి. ఏదీ ఉత్త‌గ‌నే ఆయ‌న నిర్ణ‌యం తీసుకోడు. ప్ర‌తి దానికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటాయి. ద‌ళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం దాన్ని రూపు క‌ల్ప‌న చేయ‌లేదు వాస్త‌వానికి. ఆయ‌న అది ఎప్పుడో వ‌చ్చిన ఆలోచ‌న‌. ఎందుకు వ‌చ్చిందీ ఆలోచ‌న‌? దాని వెనుక రాజ‌కీయ కార‌ణాలేంటీ ? అనేవి ఆయ‌న‌కే తెలుసు. ఎవ‌రికీ అంతుప‌ట్ట‌వు.

ద‌ళితుల‌కు టీఆరెస్ దూరమ‌వుతుంద‌నే సంకేతాలు కేసీఆర్‌కు వ‌చ్చాయి. మూడెక‌రాల భూమి ఇస్తాన‌ని ఇచ్చిన హామీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. సీఎం చేస్తాన‌నే మాట చ‌రిత్ర‌లో ఆయ‌న్ను వెంటాడుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ను అకార‌ణంగా తొల‌గించిన విష‌యంలోనూ ఆ కుల‌స్తులు ఆగ్ర‌హంగానే ఉన్నారు. దీంతో మూడెక‌రాల బ‌దులుగా ఏం చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న చాల రోజులుగా కేసీఆర్ చేస్తున్నాడు. ఆ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిరూపంగానే ద‌ళిత‌బంధు పుట్టింది. ప‌దిల‌క్ష‌లిస్తే ఆర్థిక అభివృద్ధి జ‌రుగుంద‌నేది ఈ ప‌థ‌కం భావ‌న‌. ఏఏ వ్యాపారాలు చేసుకోవ‌చ్చో నిన్న గ‌వ‌ర్న‌మెంట్ ఓ జాబితా కూడా రిలీజ్ చేసింది. అయితే కేసీఆర్ భావ‌న మాత్రం ఆ మొత్తం ద‌ళితుల చేతుల్లోకి వెళ్లిపోవాలి. వారు దేనికైనా ఖ‌ర్చు చేసుకోవ‌చ్చ‌నే ఫీలింగుతోనే ఉన్నాడు.

రైతుబంధు ఉద్దేశ్యం కూడా ఇలాగే ఉంటుంది. అది కొను.. ఇది కొను అని చెప్పేక‌న్నా.. నీ ఖ‌ర్చులు నీ ఇష్టం.. దేనికైనా ఖ‌ర్చు చేసుకో.. అనే కాన్సెప్ట్ పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. రాజ‌కీయంగా వంద‌శాతం ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కం ఇది. ఇప్పుడు ద‌ళిత‌బంధు కూడా ఇదే త‌రహాలో ఉంటుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో దృష్టి అటు సారించి.. ద‌ళితుల ఓట్లు కూడా వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. 500 కోట్లు విడుద‌ల చేశారు. కేసీఆర్ ఎటుపోతే ప్ర‌తిప‌క్షాలు కూడా అటే పోతాయి. వాటికి తెల‌వ‌కుండానే కేసీఆర్‌ను ఇవి అనుస‌రిస్తాయి.

కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ద‌ళిత‌, గిరిజ‌నుల పాట అందుకున్నాడు. ఇంద్ర‌వెళ్లికి వెళ్లి ల‌క్ష‌మందితో మీటింగు పెట్టాడు. దీనిపై టీఆరెస్ నేత‌లు స్పందించారు. ఆదివాసీల‌ను పొట్టున పెట్టుకుని ఇప్పుడు అక్క‌డ మీటింగులు పెడ్తున్నారా? అని కౌంట‌ర్ ఇస్తున్నారు. మ‌రో వైపు ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ద‌ళిత‌, బ‌హుజ‌నుల పేరుతో బీఎస్పీ ప్లాట్ ఫాం పై కొత్త రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టాడు. చెప్ప‌డానికి ద‌ళిత‌, బ‌హుజ‌నుల‌ని అంటారు కానీ… ఆయ‌న‌దీ పూర్తి ద‌ళిత కాన్స‌ప్టే.

కేసీఆర్ ద‌ళిత‌బంధు ప్ర‌క‌టించిన త‌ర్వాతే ప్ర‌వీణ్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ద‌ళితుల‌పై ఇంకా ఈ డ్రామాలు ఎన్ని రోజులు? అనే భావ‌న‌లో ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఉన్నాడు. ఓ ర‌కంగా కేసీఆరే ప్ర‌వీణ్‌ను బ‌య‌ట‌కు వెళ్లేలా చేశాడు. బీఎస్పీ వైపు అడుగులు ప‌డేలా చేశాడు. ఇప్పుడంతా కేసీఆర్ బాట‌లోనే సాగుతున్నారు. ద‌ళితుల జ‌పం చేస్తున్నారు. వాళ్ల చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారు. కేసీఆర్ కోతిని హ‌న్మంతుడిని చేయాల‌నుకుంటాడు. వాటిని తిప్పికొట్టే ప‌నిలో, కేసీఆర్ ట్రాపులో ప‌డి హ‌న్మంతుడిని కోతిని చేద్దామ‌నుకుంటాయి ప్ర‌తిప‌క్షాలు. అంతే. అంతిమంగా కేసీఆర్‌కు త‌ను అనుకున్న లాభం జ‌రిగిందా లేదా అనేది ప్ర‌యార్టీ. రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డిందా లేదా అనేది ఇంపార్టెంట్‌. ఎవ‌రేమ‌నుకున్నా డోంట్ కేర్‌.

You missed