మ‌ర‌క మంచిదే. ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లో ఫేమ‌స్ అయిన డైలాగ్ ఇది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా అంత ఫేమ‌స్‌గా మారింది. రాష్ట్రమే కాదు..దేశం చూపు కూడా దీనివైపే ఉంది. ఈట‌ల రాజేంద‌ర్ ప‌డ్డ మ‌ర‌క ఉప ఎన్నిక‌కు దారితీసింది. రాజేంద‌ర్ వ‌ల్ల త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక ఎంతో మందికి మేలు చేసింది. ఇంకా మేలు చేస్తూనే ఉంది. ఎన్నిక ముగిసిన రోజు సాయంత్రం వ‌ర‌కూ ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు మేలు జ‌రుగుతూనే ఉంటుంది. అదృష్టం వ‌రిస్తూనే ఉంటుంది.

మూల‌కుప‌డ్డ నేత‌లు క‌ళ్ల‌కు అద్దుకోబ‌డుతున్నారు. ఇక ప‌ద‌వులు ద‌రి చేర‌వ‌ని ప్ర‌స్టేష‌న్‌లో ఉన్న నేత‌ల కాళ్ల ద‌గ్గ‌ర‌కే ప‌ద‌వులు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాయి. ఈట‌ల రాజేంద‌ర్ మంత్రిగా ఉన్నా ఆ రోజుల్లో జ‌ర‌గ‌ని ప్ర‌యోజ‌నం ఇప్పుడు వెయ్యి రెట్లు జ‌రుగుతుంది ఆ ప్ర‌జ‌ల‌కు. ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి అయినందుకు ఎంత సంతోషించారో.. ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నిక కార‌కుడిగా మార‌డం అంత‌కు వెయ్యి రెట్లు సంతోషాన్ని క‌లిగిస్తున్న‌ది. గెలుపు ఓట‌ముల మాట దేవుడెరుగు.

ఈ క‌ష్ట కాలంలో, క‌రోనా క‌రువు కాలంలో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఆప‌ద్భాంద‌వుడిగా నిలుస్తున్నాడు. ఆయ‌న ప్ర‌యోజ‌నాలు, పార్టీ లాభాలు, ప‌రువు ప్ర‌తిష్ట‌లు, పంతాలు, ప‌గ‌లు ఆయ‌న‌కు ఉండొచ్చు. కానీ అంతిమంగా లాభ‌మైతే జ‌రుగుతున్న‌ది. ప్ర‌యోజ‌నం సిద్దిస్తున్న‌ది. క‌ల‌లో కూడా ఊహించ‌ని ప‌ద‌వులు ఒళ్లో వ‌చ్చి వాలుతున్నాయి. ఎక్క‌డా అమ‌లు కానీ, ఆగిపోయిన ప‌థ‌కాలు ఇక్క‌డ రా ర‌మ్మ‌ని పిలుస్తున్నాయి. కోట్ల నిధులు పారుతున్నాయి. జీతాలిచ్చేందుకు ఖ‌జానాలో కొర‌త ఉన్నా.. హుజురాబాద్‌కు మాత్రం కొర‌త లేదు. ఎన్నిక అయ్యేంత వ‌ర‌కు కొర‌త రాదు.

ముఖ్య నేతలంతా ఇక్క‌డ‌నే ఉంటున్నారు. వారంతా ప్ర‌జ‌ల‌కు బంగారు బాతుల్లా క‌నిపిస్తున్నారు. న‌డిచి వ‌స్తున్న ధ‌నబాండాగారాల్లా ద‌ర్శ‌నిమిస్తున్నారు. త‌మ క‌రువును, దారిద్య్రాన్ని పార‌ద్రోలే ల‌క్ష్మీ దేవ‌త‌లా సాక్షాత్క‌రిస్తున్నారు. ఇదంతా రాజేంద‌ర్ చ‌ల‌వే అనుకుంటున్నారు. కేసీఆర్ ద‌య‌, మా ప్రాప్తం అని కూడా అనుకుంటున్నారు.

You missed