“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్ షూటింగ్‌లో ఎక్స్ పర్ట్. తుపాకీ చేతికి అందాక ఆగుతాడా.. ధన్ ధన్ ధనాధన్ ఢాం ఢాం అని కెసిఆర్ షూట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పరుగులు పెట్టి చెట్టు పుట్టలు వెతుక్కుని దాక్కోవాల్సి వచ్చింది.”.. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ను రెచ్చగొడితే ఉప ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయాలు సంభవించడంపై ఆనాడు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు డి నాగేశ్వర చేసిన విశ్లేషణ ఇది.
ఇప్పుడు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కూడా పాత అలవాటు లాగానే కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ చేతికి తానే అ స్త్రాలను అందించి ఆగమాగం అవుతున్నదా ? అంటే అవుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి.
అభ్యర్థుల ఖరారులో ఎడతెగని ఆలస్యం.. టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణల ఫలితం.. కాంగ్రెస్ టికెట్ల ఆశావాదులే కాంగ్రెస్ పార్టీ జెండాలను దహనం చేసి అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థులను ఓడించి తీరుతామనే రెబెల్ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లోని ఈ పరిస్థితి కండ్ల కట్టినట్టు కనిపిస్తోంది.
ఇలాంటి స్వయంకృతాపరాధాల పరంపరలో సోమవారం మెదక్ ఎంపీ, దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తిపోట్ల దాడి ఘటనతో కెసిఆర్ చేతికి సరికొత్త తాజా వజ్రాయుధం అందినట్లు అయింది.
ఈ ఘటన అనంతరం సోమవారం నాటి బహిరంగ సభలో కేసీఆర్ బీఆరెస్ అభ్యర్థిపై కత్తి తో దాడిని తనపై జరిగిన దాడిగానే ప్రకటించి సంఘటన పట్ల తన సీరియస్ నెస్ ను ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ కత్తి పడితే ప్రజలు ఓటు హక్కుతో ఎదిరించాలని కెసిఆర్ పిలుపునివ్వడం ఎన్నికల్లో కాంగ్రెస్‌పై కెసిఆర్ సరికొత్త ప్రతిదాడి ప్రారంభించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేతిలో కత్తి పట్టుకుంటే ప్రజలు తమ చేతిలో ఉన్న ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని కెసిఆర్ పిలుపునివ్వడం .. ఆయన చేతికి కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో ఆయుధాన్ని అందించినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.