నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వ్యవహార శైలి, మాట్లాడిన తీరు మరీ వివాదస్పదమయ్యాయి.

బీఆరెస్‌ మేనిఫెస్టోను చించేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపగా.. ఇదే వేదికగా కార్యకర్తలను ఉద్దేశించి మనకు ఎన్ని సీట్లొస్తాయో తెలవదు.. కానీ మనదే అధికారం అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు తొలత కార్యకర్తలకు అర్థం కాలేదు. మళ్లీ మళ్లీ ఇవే వ్యాఖ్యలను రిపీట్‌ చేశాడు అర్వింద్‌. ‘మనకు సీట్లు ఎన్ని వస్తాయో మరిచిపోండి.. ఎన్నైనా రానీయండి.. కానీ అధికారం మాత్రమే మనదే.. ఎవడడ్డుకుంటాడో అడ్డుకోమను..’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

అంటే ఎన్ని సీట్లు వచ్చినా.. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కొనుగోలు చేసైనా సరే బీజేపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పరోక్షంగా అర్వింద్‌ వ్యాఖ్యానించడం వివాదస్పమయి కూర్చుంది. ఓవైపు బీఆరెస్‌ మేనిఫెస్టోను చింపడం పట్ల బీఆరెస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతుండగా.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏమైనా చేసేందుకు సిద్దమే అనే విధంగా ఎంపీ వ్యాఖ్యలు ఉండటం రాజకీయంగా చర్చకు తెరతీశాయి. ఇందూరు రాజకీయాలను మరింత వేడెక్కించాయి.

You missed