పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో పసుపు బోర్డు పై సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న నమ్మకం రైతుల్లో కనిపించింది కూడా. స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడంతో పసుపు బోర్డు అంశం కార్యాచరణ తెరపైకి ఎక్కింది. మహబూబ్ నగర్‌లో ప్రకటన మొదలు తాజాగా కేంద్రం ఇచ్చిన జాతీయ పసుపు బోర్డు మండలి ఏర్పాటు నోటిఫికేషన్ దాకా జరిగిన పరిణామాలు రైతుల్లో రైతుల్లో ఒకింత ఉత్సాహాన్ని నింపినా సందేహాలను మాత్రం తొలగించలేకపోయాయి.

పసుపు బోర్డు ఏర్పాటు ఎలా ఉండబోతోంది.. దాని ఏర్పాటు ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనాలను అందించే చర్యలు చేపట్టబోతున్నారు.. ఇవన్నీ ఎప్పుడు మొదలు కాబోతున్నాయి ఇలాంటి సందేహాలు రైతులను వీడలేదు. ఇదే సమయంలో ప్రధాని నోట పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం చేస్తున్న స్టంటుగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో పసుపు బోర్డు ఏర్పాటు కార్యాచరణ ప్రక్రియ ఆశాజనకంగా ప్రారంభమవుతుందా లేక మతలబు మయంగా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా జాతీయ పసుపు బోర్డు మండలిని నెలకొల్పేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ రైతుల్లో, విపక్షాల్లో అనుమానాలను తొలగించలేదనే చర్చ ప్రస్తుతం మొదలైంది.

అందులో రెండు ప్రధాన కారణాలు చర్చలో వినిపిస్తున్నాయి. ఒకటి పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అనేది నోటిఫికేషన్ లోనూ స్పష్టత ఇవ్వలేదు. రెండవది బిజెపి గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు తోపాటు పసుపు మద్దతు ధర అంశంపై ఆశాజనకంగా ప్రస్తావించిన అంశం నోటిఫికేషన్ లో లేకపోవడం. ప్రపంచంలో పసుపు ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటే.. భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉంది. అందులో నిజామాబాద్ జిల్లా తోబాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. వీటిలో నిజామాబాద్ జిల్లాదే పసుపు సాగులో ప్రథమ స్థానం.

రాష్ట్రంలో సాగయే పసుపులో 30 శాతానికి పైగా నిజామాబాద్ జిల్లాలోనే ఉంటుంది. అందుకే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ జాతీయస్థాయి పార్టీల హామీలు నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగాయి. దీంతో పసుపు బోర్డు ఏర్పాటనేది జరిగితే తెలంగాణ రాష్ట్రంలో, అది నిజామాబాద్ జిల్లాలో ఉంటుందనేది ఆకాంక్ష. కానీ నోటిఫికేషన్ కు ముందు, నోటిఫికేషన్ లో గాని పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయనున్నామని స్పష్టతను కేంద్రంగాని, బిజెపి నాయకత్వం గానీ ఇవ్వలేదు. దీంతో పసుపు రైతుల్లో .. పసుపు బోర్డు ఉద్యమాల్లో పసుపు బోర్డు ఇవ్వకపోవడం తెలంగాణ పట్ల వివక్ష గా చూడడం కొనసాగింది. కానీ నోటిఫికేషన్ తర్వాత పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రంలోని బిజెపి తెలంగాణ ఆకాంక్షను.. నిజామాబాద్‌ జిల్లా రైతుల ఆకాంక్షలను ప్రతిఫలింప చేయకపోవడం వివక్ష మరోసారి పొడుచుకు వస్తున్నదా అనే సందేహాలు రైతుల మధ్య చర్చలో వ్యక్తమవుతున్నాయి. పసుపు బోర్డు ఎంత ముఖ్యమో పసుపునకు మద్దతు ధర కేంద్రం ఇవ్వడం అంతే ముఖ్యమనే తక్షణ ఆవశ్యకత రైతుల్లో ఉన్నది.

పసుపు బోర్డును ఐదు రోజుల్లో తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ మద్దతు ధర సైతం తెస్తానని అదే బాండ్ పేపర్లో హామీ ఇవ్వడం ఈ ఆవశ్యకతకు నిదర్శనం. కానీ రైతుల్లో ఉన్న మద్దతు ధర ఆవశ్యకత ఆశలు, అరవింద్ హామీ ఇచ్చిన మద్దతు ధర ప్రస్తావనలు ప్రధాని ప్రకటన మొదలుకొని నోటిఫికేషన్ దాకా ఎక్కడ స్పష్టంగా కాకపోయినా కనీసంగా అయినా లేకపోవడం రైతులను నిరాశ పరుస్తున్నదని చెప్పక తప్పదు. గడిచిన ఐదేళ్లలో పసుపు బోర్డు పోరాటాల వేళ రైతుల, బోర్డు సాధన కమిటీ కొందరు నాయకుల ఆఫ్ ద రికార్డు మాటలు ఇప్పుడు మీడియా మెదళ్లలో సౌండ్ చేస్తున్నాయి. అదేమిటంటే పసుపునకు మద్దతు ధర విక్రయాలకు ఒకరోజు ముందు ఇచ్చి పసుపు బోర్డును పది రోజులు లేటుగా ఇచ్చిన పర్వాలేదు అనేది. అంటే రైతుకు మద్దతు ధర తక్షణమే రాదా ?.. పసుపు బోర్డు పని ప్రారంభమై దాని పరిశోధనలు, దాని చర్యలు, సో అండ్ సోలు విజయవంతంగా పూర్తయితే గానీ మద్దతు ధర రాదా..? పసుపు మార్కెట్లో వాణిజ్య పరమైన లాభాల గీటు రాయిని పసుపు బోర్డు అందుకో లేక పోతే మద్దతు ధర కల గానే మిగిలి పోనుందా ?…బోర్డు ఇచ్చాం కదా అని బి.జే.పి. , రైతులకు ఏం లాభం జరిగిందని రేపటి బిజెపి యేతర పక్షాలు చేసుకునే రాజకీయ క్రీడలో రైతులు మళ్లీ ఓడి పోనున్నారా ? అనే భయాలు రైతు పక్ష వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా బోర్డ్ హామీతో బాటు మద్దతు హామీ ఏక కాలం లో అమలు చేస్తేనే తప్ప రైతులకు న్యాయం జరగదు అనే దిశగా సరి కొత్త పోరాటాల ఘట్టం మొదలు కానున్నదా అనే వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పటి దాకా ఓన్లీ పసుపు బోర్డు ఫైట్..ఇప్పుడు పసుపు బోర్డు తో బాటు మద్దతు ధర కలిపి ఫైట్ జరగనున్నది అనే చర్చ ఈ సారి ఏ పార్టీ పీక నొక్క బోతున్నదో చూడాలి.

You missed