ఇందూరు బీజేపీ టీం రెడీ అయ్యింది. అర్వింద్ ఇందూరు బీజేపీలో తన పెత్తనాన్ని నిలుపుకున్నాడు. తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలో తన సత్తా చాటుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై అర్వింద్‌ ప్రత్యేకంగా నజర్ పెట్టాడు. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో తను అనుకున్న అభ్యర్థులే ఫైనల్‌ అయ్యేలా చక్రం తిప్పాడు. వీరే నేడో రేపో ప్రకటించే మొదటి బీజేపీ లిస్టులో ఫైనల్‌ కానున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గం నుంచి కులాచారి దినేశ్‌, ఆర్మూర్‌ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బోధన్‌ నుంచి మేడపాటి ప్రకాశ్‌ రెడ్డిల పేర్లు ఫైనల్‌ చేశారు. అనూహ్యంగా బాల్కొండ నుంచి మల్లిఖార్జున్ రెడ్డికి కాకుండా అతని మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకురాలు ఏలేటి అన్నపూర్ణమ్మకు టికెట్ కన్ఫాం చేశారు. అర్వింద్‌ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే బీజేపీ పలు సర్వేలు చేసుకున్నది. వారి సర్వే ఆధారంగా నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఐదు నియోజకవర్గాలు విజయం సాధిస్తామని వారు భావిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో దాదాపు ఇద్దరు చొప్పున బీజేపీ టికెట్ ఆశించారు. కానీ అర్వింద్‌ ఆది నుంచి చెప్పుకుంటూ వస్తున్న తన గ్రూపు, తను ముందుగా మాటిచ్చిన వారికే టికెట్లు ఫైనల్ చేసేలా అధిష్టానాన్ని ఒప్పించింది.

అర్బన్‌ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ తో పాటు సీనియర్ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణ కూడా టికెట్‌ ఆశించాడు. కానీ అర్వింద్‌ తన రాజకీయ ఆరంగేట్రం నుంచి యెండలతో పాటు అతని వర్గానికి చెక్‌ పెడుతూ వచ్చాడు. అంతా తానై వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో యెండల మాట పార్టీలో ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు. దీంతో అర్వింద్‌పైనే అధిష్టానం భారం వేసింది. అతను ఎలా చెబితే అలా రీతిలో వ్యవహరిస్తున్నది. దీంతో అతని టీమ్‌కే జై కొట్టనుంది బీజేపీ అధిష్టానం. బోధన్‌ నుంచి మేడపాటి ప్రకాశ్‌రెడ్డితో పాటు మోహన్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశించాడు. కానీ మేడపాటి ఒకసారి టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసి ఉన్నాడు. నియోజకవర్గంలో పట్టు సాధించాడు. దీంతో అర్వింద్‌ మేడపాటికే జై కొట్టినట్టు తెలుస్తోంది. ఆర్మూర్‌ నుంచి పైడి రాకేశ్‌ రెడ్డి పేరు ఖరారైనా.. అర్వింద్‌ కూడా ఇక్కడ ఇంట్రస్ట్ చూపుతున్నాడని ప్రచారం జరిగింది.

కానీ అర్వింద్‌ తన యుద్దక్షేత్రం కోరుట్లకు మార్చుకున్నట్టు తెలుస్తోంది. బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ తనయుడు మల్లిఖార్జున్‌కు దాదాపు టికెట్ ఇస్తారని ప్రచారం జరగగా… చివరి నిమిషంలో అతన్ని మార్చి అన్నపూర్ణమ్మకే జై కొట్టింది బీజేపీ. ఇక్కడ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఢీకొట్టాలంటే మల్లిఖార్జున్‌ సరిపోడనే భావనలో అర్వింద్‌, బీజేపీ అధిష్టానం ఉంది. అన్నపూర్ణమ్మను బరిలో నిలిపితే ఆమె పరిచయాలు, సానుభూతి తదితర అంశాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మల్లిఖార్జున్‌ రెడ్డి కూడా వాస్తవ పరిస్థితులు అవగతమయ్యాయి. బీజేపీ వాదనలతో ఏకీభవించాడు. తల్లి గెలుపు కోసం తండ్లాడటం తప్పితే చేసేదేమీ లేదని గ్రహించాడు. నిజామాబాద్‌ రూరల్ నుంచి కులాచారి దినేశ్‌ పేరు మొదటి నుంచి వినిపిస్తున్నా.. ఇక్కడ అర్వింద్‌, మాజీ మంత్రి సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వర్ రావు పేర్లు కూడా మధ్యలో వినిపించాయి. ఎట్టకేలకు కులాచారినే అధిష్టానం ఫైనల్‌ చేసినట్టు తెలిసింది.