తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో నిలిపి న తమ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన అభివృద్ధిని ఘనంగా చెప్పుకోవడానికి సైతం ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని వారు బలంగా కోరుకుంటున్నారు. వాస్తవానికి చేసిన అభివృద్ధిని గాని, ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు చేసిన విలువైన చేత సహాయం లేదా మాట సహాయాన్ని గాని ప్రచారం చేసుకోవడంలో బాజిరెడ్డి గోవర్ధన్ పెద్దగా ఆసక్తి చూపడు అనేది అందరికీ తెలిసిందే. కానీ మారిన రాజకీయాలు, ప్రచారానికి పెద్దపీట వేస్తున్న రోజులు దృష్ట్యా తమ నేత కూడా మారాలని.. అందించిన అభివృద్ధిని ఘనంగా ప్రచారం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని రురల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ కేడర్ గట్టిగా కోరుకుంటున్నది.
నాయకుడిగా బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రత్యేకంగా ప్రచారం అవసరంలేదు. పాలిటిక్స్ లో 30 ఇయర్స్ గ్రాండ్ హిస్టరీ బ్రాండ్ బాజిరెడ్డి సొంతం. బలమైన నాయకుడిగా మహా లీడర్ల నోటనే ప్రశంసలు అందుకున్న మాస్ లీడర్ ఇమేజ్ బాజిరెడ్డి గోవర్ధన్ ది. 30 ఏళ్ల నాటి రాజకీయ పరిస్థితుల నాటి నుంచి నేటిదాకా మాస్ లీడర్ గా కొనసాగడం ఆయనకే సాధ్యమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. అయితే ఆనాటి నుండి నేటి వరకు ఆయన తన గురించి గానీ, తాను చేసిన అభివృద్ధి గురించి గానీ సందర్భోచితంగా తప్ప పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం ఆయనకున్న అలవాటు. రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై నిజాల కంటే అబద్దాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్న ఈ రోజుల్లో.. కండ్ల ముందే అభివృద్ధి కనిపించినా కానే కాదు అనే రాజకీయ విచిత్రాలు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో బాజిరెడ్డి గోవర్ధన్ తన సుదీర్ఘ అలవాటును మార్చుకోవాల్సిందేనని బలమైన అభిప్రాయం ఆయన అభిమానుల్లో క్యాడర్లో వినిపిస్తున్నది.
బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా, టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ అండ్ బి, శాసనసభ వ్యవహారాలు, హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో రూరల్ నియోజకవర్గం లో కనివిని ఎరుగని అభివృద్ధి అందించారు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అధినేత, మంత్రులు, శాసనమండలి సభ్యురాలు సైతం బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రత్యేక గౌరవంతో అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సానుకూల వాతావరణం లో నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని చేసి చూపించారు బాజిరెడ్డి గోవర్ధన్.
వాగులపై వంతెనలు, మారుమూల గ్రామాలకు సైతం తారు రోడ్లు, పదుల సంఖ్యలో కొత్త గ్రామపంచాయతీ భవనాలు, వాగుల్లో విరివిగా చెక్ డ్యాములు, సాగునీటి వనరుల అభివృద్ధి, మారుమూల గ్రామాలకు, గిరిజన తండాలకు బస్సు సౌకర్యం, పాఠశాలల అభివృద్ధి, కళాశాలలు అందించడం, భారీగా సిసి రోడ్లు, పోడు భూముల పంపిణీ, కుల సంఘాల భవనాలు, విద్యుత్తు రంగ అభివృద్ధి, ఇలా ఎంతో అభివృద్ధిని తమ నాయకుడు నియోజకవర్గానికి అందించాడని.. అభివృద్ధిని ఘనంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆయన నడుము కట్టాలని.. అది వీలైనంత తొందరగా మొదలవ్వాలని క్యాడర్ మొత్తంలో ఏకాభిప్రాయంగా ఉంది. ఎన్నో అభివృద్ధి పనులు ప్రజల వినియోగంలోకి వచ్చినా.. ఎన్నో దీర్ఘకాల సమస్యలు పరిష్కారమయినా తగిన ప్రచారానికి నోచుకోవడం లేదనేది వారి ఆవేదన. ఇప్పటికీ పూర్తయిన వందల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడంలో కూడా ఆలస్యం చోటు చేసుకుంటున్నదని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
తలెత్తుకుని, సగర్వంగా చెప్పుకునేంత భారీ అభివృద్ధి ఉంది.. ఆయన వెంట నడిచి ప్రజల ఇంటింటికి చేసిన అభివృద్ధిని ప్రచారం చేసే కార్యకర్తల సైన్యం ఉంది.. కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చిన నాయకుడు ఆయన కొడుకు జగన్ ఉన్నాడు, జగన్ వెన్ను తట్టి గో అహెడ్ అనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఇంకేముంది పెద్దాయన నువ్వంటే ప్రచార బరిలోకి ఉరకడమే తరువాయి అంటూ పరిస్థితిని తమదైన శైలిలో కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ నాయకుడు బాజిరెడ్డి తాను చేసిన భారీ అభివృద్ధిని ఘనంగా ప్రచారం చేసుకోవడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనేదే తమ అభిమతం అంటున్నారు.