అటు మల్లిక్‌…. ఇటు మానాల… మధ్యలో సునీల్‌

బాల్కొండ టికెట్‌ కోసం సునీల్‌ ముప్పుతిప్పలు…

బీజేపీలో తీవ్రంగా ట్రై చేసి… కాంగ్రెస్సే బెటరని తలచి…

మానాల మోహన్‌రెడ్డి పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటున్న అధిష్టానం…

అందుకే సునీల్‌కు వెంటనే ఓకే చెప్పలేక… పెండింగ్‌లో నిర్ణయం….

 

(బాల్కొండ నియోజకవర్గ రివ్యూ…)

ముత్యాల సునీల్‌రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న నేత. ఓసారి పోటీ చేసి మంత్రికే గట్టి పోటీ ఇచ్చాను కాబట్టి ఈసారి విజయ తథ్యం అని ఊహాలోకంలో విహరిస్తున్న నాయకుడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ తనకిప్పుడు టికెట్‌ ఇచ్చే నాథుడు లేడు. పట్టించుకునే అధిష్టానం లేదు. తన సత్తా చూసి మెచ్చుకుని మెడలేసుకునే పార్టీ లేదు. భుజానెత్తుకుని ఊరేగే జాతీయ పార్టీల గుర్తింపు లేదు. ఇంత బతుకు బతికి.. అన్నట్టు… ఎన్ని పైసలన్నా ఖర్చు పెడతా.. ఒక్కసారి చాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. గెలిచి చూపిస్తానని బతిమాలుకున్నా వినడం లేదు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. గతంలో బీఎస్పీపై మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చాడు.

విజయం దరిదాపుల్లోకి చేరుకున్నాడు. కాంగ్రెస్‌ నుంచి ఈరవత్రి అనిల్‌ అస్త్ర సన్యాసం చేయడం కూడా సునీల్‌కు కలిసి వచ్చింది. అందుకే భారీగానే ఓట్లు సంపాదించగలిగాడు. కానీ గతం గురించి చెప్పుకుంటూ పూటగడుపుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. బీజేపీ హవా నడుస్తుందని దానికి గాలం వేశాడు. బీజేపీలో చేరుతున్నట్టు కూడా గతంలో ప్రకటించేసుకున్నాడు. కానీ అక్కడ ముహూర్తం కుదరలేదు. అర్వింద్‌ రానీయలేదు. తలుపులు కాదు కదా.. గేటు కూడా ఓపెన్ చేయలేదు. దీంతో కొన్ని రోజులు బీజేపీ టికెట్‌ కోసం పోరాడాడు. బండి సంజయ్‌ సపోర్టు తీసుకున్నాడు. సర్వేలలో తనే ముందున్నానన్నాడు. మల్లిఖార్జున్ తన ముందు నత్తింగ్‌ అంటూ ప్రచారం చేసుకున్నాడు.

కానీ అర్వింద్‌ మల్లిఖార్జున్‌కు మాటిచ్చాడు. అందుకే ఇక అక్కడ పప్పులుడకవని అనుకుంటున్న తరుణంలో… కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌లో జోష్‌ ను నింపాయి. అప్పటికే సునీల్‌.. ఇది కాకపోతే అది..అని డిసైడ్‌ అయి ఉండటం… కాంగ్రెస్‌ బలం పుంజుకునే పరిస్థితి కనిపించడంతో ఇక కాంగ్రెస్‌ గడప తొక్కాడు. ఢిల్లీలో మకాం వేశాడు. రేవంత్‌రెడ్డిని కలిసి.. ఢిల్లీ పెద్దలతో కమిట్‌మెంట్‌ తీసుకుని ఇక పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అననుకున్నాడు. ఇక్కడ చుక్కెదురైంది సునీల్‌కు. చేదు అనుభవం తోడు రాగా.. అక్కడ ఇప్పుడే చెప్పలేం.. ఇవ్వలేం.. తీసుకోం.. ఆగాలి… సమయం కావాలి… అంటూ సునీల్‌ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో మళ్లీ తల వేలాడేసుకుని నియోజకవర్గానికి వచ్చాడు. షరా మామూలుగా తన పనులు తాను చేసుకుంటున్నాడు.

ఖమ్మంలో జరిగే నేటి కాంగ్రెస్‌ బహిరంగ సభలో సునీల్‌ చేరాల్సి ఉండే. కానీ చాన్స్‌ లేకుండా పోయింది. బీజేపీలో మల్లిఖార్జున్‌ రెడ్డి అడ్డుతగులితే.. కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తనకు ఆటంకంగా ఉన్నాడా.? అనే భావనలో సునీల్‌ ఉన్నాడు. ఎందుకంటే.. రేవంత్‌ రెడ్డితో మానాల మోహన్‌రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. జిల్లాకు పెద్దన్నగా వ్యవహరిస్తన్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వద్ద కూడా మానాలకు మంచి పేరుంది. దీంతో వీరిద్దరి ద్వారా తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలనే ఓ ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. దీంతో సునీల్‌ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టేసింది కాంగ్రెస్‌ అధిష్టానం.

ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు సునీల్‌. మళ్లీ గతంలో లాగా బీఎస్పీ ప్లాట్‌ఫామే దిక్కవుతుందా..? అనే ప్రష్టేషన్‌లోకి వెళ్లిపోయాడు. తన అనుచరులకు, ప్రజలకు తను ఏపార్టీలో ఉన్నాడో.. ఉండబోతున్నాడో…. చేరుతున్నాడో.. చేరబోతున్నాడో.. ఏదీ సరిగ్గా చెప్పలేని సందిగ్ధ, డోలాయామాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ముత్యాల సునీల్‌కుమార్‌ రెడ్డి.

You missed