ఇందూరు పొలిటికల్‌ వార్‌లో

కీలకం ఆ ముగ్గురు….

పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర

క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ…

తన అనుచరవర్గానికే టికట్లిచ్చి జిల్లా పార్టీపై తనదైన ముద్రవేసుకునేందుకు అర్వింద్‌ తహతహ…

 

రాష్ట్ర రాజకీయ యవనికపై ఇందూరుది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఏం జరిగినా.. అదో చర్చ. ఇక్కడి రాజకీయాలంటే అంతటా ఆసక్తి. ఉద్దండులు పోటీ పడ్డ జిల్లా. పెద్ద పెద్ద పదవులు అలంకరించి వన్నెలద్దిన వైనం. అందుకే నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలంటే అందరికీ ఆసక్తి. ప్రస్తుతం ఇక్కడ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత … బీఆరెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నీ తానై నడిపిస్తున్నారు. జిల్లాలో అన్ని స్థానాలు దక్కించుకోవడంలో ఆమె పాత్ర కీలకం. అయితే ఎంపీగా ఆమె ఓడిపోవడం.. అర్వింద్‌ గెలవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో కొంతకాలం ఆమె ఇందూరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మళ్లీ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిపొందినా ఇంతకు మునుపులా జిల్లాకు టైమ్ కేటాయించలేరు. కానీ ఈ మధ్యా ఆమె యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చారు. మళ్లీ జిల్లాలో అన్ని స్థానాలూ బీఆరెస్‌ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. పదవులు రాక, ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్న నేతలందరికీ నేనున్నాననే భరోసా ఇస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేసేలా చేస్తున్నారు. ఆమె స్వరం పెంచారు. రాజకీయంగా వ్యూహాల్లో కూడా పదను పెంచారు. ఈ క్రమంలో మళ్లీ కవిత జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్‌ కూడా జిల్లాలో తమ సత్తా చాటి గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్దన్నగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… ఇక్కడ పార్టీ బలోపేతం, గెలుపు, అభ్యర్థుల ఎంపిక బాధ్యత మొత్తం సుదర్శన్‌రెడ్డి భుజస్కంధాలపై పెట్టాడు. దీంతో ఆయన పోటీ చేసే బోధన్‌ నియోజకవర్గంపై కాన్సన్‌ట్రేట్ చేస్తూనే మిగిలిన స్థానాలపై దృష్టి పెట్టారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ హవా పెరిగింది. జనాల్లో ఓ చర్చ మొదలైంది. దీంతో సహజంగానే ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చినవారిని ఎవరికి కాదనకుండా పార్టీలో చేర్చుకునేందుకు సుదర్శన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్‌ ఇస్తూనే… టికెట్ విషయంలో సర్వే పేరుచెబుతూ తప్పించుకుంటున్నారు. వాస్తవంగా టికెట్‌ ఎవరికిస్తే గెలుస్తారో కూడా సుదర్శన్‌రెడ్డి సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీని జిల్లాలో అన్ని స్థానాల్లో గెలిపించుకుని పూర్వవైభవం దిశగా తీసుకుపోవాలనే తపనతో వయోభారం ఇబ్బంది పెడుతున్నా కష్టపడుతున్నాడు సుదర్శన్‌రెడ్డి.

ఇక అర్వింద్‌ అయితే పార్టీ మొత్తం తనదే అనే ముద్ర వేసుకునే పనిలో ఉన్నాడు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి అంతా తానై వ్యవహరిస్తున్నాడు. తనకు చెందిన వారు.. తనని నమ్మిన వారిని మాత్రమే చేరదీస్తున్నాడు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా ఎవరి మాట వినలేదు. తనకు నచ్చినవారికే టికెట్లు ఇప్పించుకుని మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకున్నాడు. దీంతో అధిష్టానం కూడా జిల్లాను అర్వింద్‌ చేతుల్లో పెట్టినట్టే చేస్తన్నది. దీంతో ఇప్పటికే ఆర్మూర్‌ నుంచి పైడి రాకేశ్‌రెడ్డికి టికెట్‌ వచ్చేలా చేసుకుంటున్నాడు. వినయ్‌రెడ్డిని దూరం పెట్టాడు. బాల్కొండలో మల్లిఖార్జున్‌కు మాటిచ్చాడు. సునీల్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా దగ్గరికి రానీయలేదు.

బోధన్‌లో ఓ ఇద్దరిని పెట్టుకున్నాడు. అర్బన్‌లో ధన్‌పాల్‌ సూర్యనారాయణకు మాటిచ్చాడు. అతను ఇంటింటి పాదయాత్ర చేస్తూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాడు. రూరల్‌ కులాచారిని తిప్పుతున్నాడు. అతనూ అర్వింద్‌పైనే ఆశలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒకవేళ చివరి నిమిషంలో పార్టీలో ఎవరైనా చేరినా.. టికెట్‌ ఆశించినా.. అంతా అర్వింద్‌ కనుసన్నల్లోనే జరగాలనే విధంగా సీన్‌ క్రియేట్ చేశాడు. తన మాట ప్రకారం సాగితే పార్టీని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత తనదే అనే విధంగా అధిష్టానంతో చెప్పి ఒప్పించుకుంటున్నాడనే ప్రచారం చేస్తున్నారు ఆయన అనుచరులు. ఇలా ఇందూరు రాజకీయాల్లో ఈ మూడు పార్టీల నుంచి ఈ ముగ్గురు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఎవరికి వారే వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరి రాజకీయ ఎత్తుగడల్లో వారున్నారు.

You missed