మంత్రి మందలించినా తీరు మారలే…

బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్‌ సర్వే ఏడీ

మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్‌…

ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్‌ కలెక్టర్‌…

చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను పీడించి.. బలవంతపు వసూళ్లు….

ఏడీ శ్యాం సుందర్‌రెడ్డిపై ఏసీబీ దాడిపై జిల్లాలో సర్వత్రా చర్చ…

అవినీతి అధికారుల గుండెల్లో గుబులు

 

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

శ్యాం సుందర్‌రెడ్డి. ల్యాండ్‌ సర్వే ఏడీ. పక్కా లంచావతారం. చేతిలో కాసులు పడనిదే ఏ ఫైలూ కదలదు. లేదంటే ఆ రైతు కాళ్లకు చెప్పులరిగేదాకా తిరగాల్సిందే. ఎవరు చెప్పినా వినడు. లంచం ఇస్తేనే పని పూర్తవుతుంది. లేదంటే ఆ ఫైలు అటకెక్కుతుంది. చివరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కూడా ఓ సారి అక్షింతలు పడ్డాయి. పద్దతి మార్చుకోమ్మంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారాయన. ఉహూ… వినలే. తీరు మారలే. తోటి అధికారులు ఒకరిద్దరు బుద్ది చెప్పి చూశారు. ఇలాగైతే కష్టమే.. తీరు మార్చుకో.. అన్నారు. పోపోవోయ్‌.. పెద్ద చెప్పొచ్చారు అనే లెవెల్లో బిల్డప్‌ ఇచ్చాడు.

8 నెలలుగా ఇదే వరుస. చివరకు ఓ రైతు విసిగివేసారి పోయి తిక్కరేగి ఏసీబీకి పట్టించాడు. ఇదీ శ్యాం సుందర్‌రెడ్డి అనే లంచావతారి కథ. మోర్తాడ్‌ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన దుగ్గెర రాజేందర్‌ అనే రైతు నుంచి పదివేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో కూడా ఇదే తీరు. దీంతో అక్కడి కలెక్టర్ ఇతగాడిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశాడు. అప్పటి నుంచి ఎక్కడ పోస్టింగ్‌ ఖాళీ దొరుకుతుందా అని వెయిటింగ్‌లో ఉన్న ఈ లంచావతరానికి నిజామాబాద్‌ ఏడీ పోస్టు ఖాళీ కావడంతో ఇక్కడి వచ్చాడు. ఇతని గురించే ముందే తెలుసుకున్న అప్పటి కలెక్టర్‌ నారాయణరెడ్డి వద్దుపొమ్మన్నాడు. రెండోసారి ఫైరవీ తెచ్చుకున్నాడు. అయినా తిప్పి పంపాడు. ఆఖరకు కమిషనర్‌ సిఫారసుతో వచ్చి జాయిన్‌ అయ్యాడు. ఇక లంచావతారానికి తెర తీశాడు.

సరిగ్గా ఇక్కడికి వచ్చి 8 నెలలు. ఆనాటి నుంచి ఏసీబీకి దొరికే వరకు దోచుకుంటూనే ఉన్నాడు. ఏ ఒక్కరినీ వదల్లేదు. ఎవరు చెప్పినా వినలేదు. ఇలా పాపం పండి కటకటాల పాలయ్యాడు. ఇతగాడితో పాటు మరో ఇద్దరు అధికారులను కూడా జైలుకు పంపారు ఏసీబీ అధికారులు. శ్యాం సుందర్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందినవాడు.

You missed