బ్రేకింగ్స్…
బిగ్ బ్రేకింగ్స్
ప్యాకేజీలు
యాంకర్ విజువల్స్
యాంకర్ బైట్స్
స్పెషల్ స్టోరీలు
గ్రౌండ్ రిపోర్ట్స్
నా 25 యేళ్ళ జర్నలిజంలో ఇవి ప్రతి రోజూ జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే ప్రతి క్షణం టెన్షన్ గా పనిచేయాలి… వర్డ్స్ కానీ… విజువల్స్ కానీ చిన్న తప్పు పడ్డా… ఇబ్బందే… ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క Electronic Media లోనే 21 యేళ్ళకు పైగా పనిచేశాను.
మొదట మా టీవి నుంచి మొదలైన ప్రస్తానం… టీవీ9, టీవీ5, ఐన్యూస్, NTV, V6 దాకా కొనసాగింది. సబ్ ఎడిటర్ స్థాయి నుంచి న్యూస్ ఎడిటర్, Dy.Output Editor స్థాయి దాకా… అదో ప్రస్తానం. నా జర్నలిజం experience లో… ఎందరో జిల్లా రిపోర్టర్లు, సిటీ రిపోర్టర్లతో మమేకం అయ్యాను. నాకు తెలిసి అందరూ మిత్రులే గానీ… శత్రువులు ఎవరూ ఉండరు. నాకు ఎంతో ఇష్టమైనది రూరల్ రిపోర్టింగ్… జిల్లాల నుంచి వచ్చే ప్రతి ఐటెమ్ లోనూ కొన్ని బాధలు, కొంత చైతన్యం, మరి కొంత విజ్ఞానం ఉంటాయి. అందుకే ఆ స్టోరీలు ఏవి వచ్చినా… వెంటనే ప్లే కావాలని తాపత్రయ పడేవాడిని. అందుకేనేమో…జిల్లా రిపోర్టర్లు అంతా నన్ను అభిమానిస్తుంటారు. ఇక డెస్కులో సబ్ ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్స్, యాంకర్స్, స్క్రోలింగ్, ప్యానల్ టీమ్… ఇలా అందరితో కలసిపోయాను.
అయితే ఏ జర్నలిస్టుల అయినా ముఖ్యంగా కోల్పోయేది ఆరోగ్యం…. కుటుంబ జీవితం. నాకు కూడా షుగర్, బీపీ ఎప్పుడో వచ్చాయి. కరోనా రెండు సార్లు ఎటాక్ చేసింది. ఆ కరోనా టైమ్ లో v6 లో సందీప్ లాంటి తమ్ముడిని కూడా కోల్పోయాం. ఇక పండగలు, పబ్బాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఎన్ని ఎగ్గొట్టామో…. ఎంతమంది బంధువులు తిట్టుకున్నారో … 40, 50యేళ్ళ వయస్సులో కూడా సెలవు అడగాలంటే భయం… ఒక రోజు, రెండు రోజులు సెలవు పెట్టాలంటే ఏమనుకుంటారోనన్న టెన్షన్… ఆఖరికి జ్వరం తగిలినా ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ సెలవు పెట్టే పరిస్థితి లేదు.
ఇక పండగలైతే మరీ దారుణం… ఇంట్లో వాళ్ళంతా ఫెస్టివ్ మూడ్ లో ఉంటే… జర్నలిస్టులు మాత్రం … ఆదివారం, పండగలప్పుడు కూడా డ్యూటీలో ఉండాలి… పిల్లలు ఇవాళైనా సెలవు తీసుకోవచ్చు కదా నాన్నా… అని అడుగుతుంటే… జర్నలిస్టుకు బిడ్డలుగా పుట్టినందుకు వాళ్ళకి ఈ బాధలు తప్పవులే అనుకునేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అడ్జెస్ట్ అయిపోయారనుకోండి.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… నేను V6 కి రిజైన్ చేశాను. అంటే దాదాపు పాతికేళ్ళ పాటు ఈ బాధలన్నీ అనుభవించాను. నేనే కాదు… మా జర్నలిస్టు మిత్రులందరిదీ ఇదే పరిస్థితి… ఇందులో బాస్ ల నుంచి వచ్చే ఇబ్బందులు మాత్రం ప్రస్తావించలేదు… అవన్నీ ప్రతి ఆఫీసులోనూ ఉండేవే కాబట్టి…

విష్ణుకుమార్ మేడుకొండూరు
సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్

Vishnu kumar

You missed