దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నమస్తే తెలంగాణ పత్రిక రావడమే ఓ చరిత్ర. ఉద్యమస్పూర్తితో వచ్చిన ఆ పత్రిక ఆదిలో జర్నలిస్టులంతా ఉద్యమకారుల్లాగే పనిచేశారు. జీతాలు పెద్దగా ఆశించలేదు. నిలబడి కలబడాలి.. అనుకున్నది సాధించాలనేదే లక్ష్యం. ఆ పేపర్‌ క్రెడిబిలిటీ కూడా అదే లెవల్లో ఉండేది. అంతా అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత దాని పరిస్థితి మారింది. ఎడిటర్లు మారుతూ వచ్చారు. చివరకు ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది. ఆనాటి ఉద్యమ జర్నలిస్టులు, కుటుంబాలను, జీవితాలను పణంగా పెట్టి వచ్చిన వారంతా చెల్లాచెదరయ్యాయి. ఆ జర్నలిస్టులంతా రోడ్డున పడటానికి కారణం నమస్తే తెలంగాణ ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి. అది అందరికీ తెలుసు.

ఆనాడు అలా వెళ్లగొట్టబడిన, అవమానించి తీసేయబడిన, బదిలీల పేరుతో బలికాబడిన జర్నలిస్టులకు అండగా నిలిచింది దిశ. దిశ డిజటల్‌ పేపర్ ఎడిటర్‌ మార్కండేయ కూడా నమస్తే రాజకీయాలకు బలైనవాడే. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న మార్కండేయ సాధ్యమైనంత వరకు నమస్తే తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్టులను తీసుకున్నాడు. కరోనా టైంలో ఉద్యోగాలు దొరకడమే గగనం, బతుకే భారమైన ఆ సమయంలో దిశ వారిని ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నది. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు నమస్తే తెలంగాణలో దాపురించాయి. ప్రభుత్వం పతనం కాగానే దీన్ని యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. ఉన్న ఉద్యోగులు తమంతగా తాను వెళ్లిపోవడమే, వీరే కుదించడమో చేసేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌..వీరంతా ఇప్పుడు దీని విషయమే పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మళ్లీ తెరపైకి వచ్చింది విజయక్రాంతి పత్రిక. గతంలో నమస్తే తెలంగాణ సీఎండీగా చేసిన సీఎల్‌ రాజం..సొంతగా పెట్టుకున్న పత్రిక విజయక్రాంతి.

ఎన్నికలకు ముందు కొన్ని రోజులు ఈ పత్రిక నడిచింది. కేసీఆర్‌పై, అధికార పార్టీపై దుమ్మెత్తి పోయడంతో కేసీఆర్ దీన్ని తొక్కేశాడు. ఈ బెదిరింపులు సీఎల్‌ రాజంకు రెండోసారి. అప్పుడు నమస్తే నుంచి కేసీయారే సీఎల్ రాజంను సాగనంపాడు. కాంగ్రెస్ స్టాండ్‌ తీసుకున్నాడనేది కేసీఆర్‌ కోపం. విజయక్రాంతి నడిపినా దాన్నీ నడపనీయలేదు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ బయటకు తీశాడు సీఎల్ రాజం. ఇటు కాంగ్రెస్‌, బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్న వ్యాపారవేత్త సీఎల్ రాజం. ప్రస్తుత రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా ఉందని భావించి ఆయన మళ్లీ ఈ పేపర్‌ను బయటకు తీసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు.

దీనికి పెద్ద కేఎం( కృష్ణమూర్తి) ఎడిటర్‌. కేఎం.. నమస్తే తెలంగాణలో ఆది నుంచి తొమ్మిదేళ్ల పాటు అసిస్టెంట్ ఎడిటర్‌గా, సెంట్రల్‌ డెస్క్‌ ఇంచార్జిగా పనిచేశాడు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా ఉన్న కట్టా శేఖర్‌రెడ్డి స్థానంలో తీగుళ్ల కృష్ణమూర్తిని కేసీఆర్ తెచ్చిపెట్టగానే ఈ పెద్ద కేఎం రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. వరంగల్‌ బీసీ బిడ్డ అయిన పెద్ద కేఎం నమస్తే తెలంగాణను ఉద్యమస్పూర్తితో నడిపించాడు. ఇప్పుడు ఆయనే దీనికి ఎడిటర్‌గా ఉన్నాడు. వచ్చే నెల మొదటి వారంలో పేపర్ బయటకు వస్తున్నది. నమస్తేలో కన్నా జీతం కొంచెం పెంచే ఇచ్చి మరీ తీసుకుంటున్నాడు సీఎల్‌ రాజం. పత్రికా విలువలతో నడిపి, జర్నలిస్టులకు అండగా ఉంటానని మాటిచ్చి మరీ దీన్ని బయటకు తీస్తున్నాడు సీఎల్‌ రాజం. ప్రస్తుతం మీడియా గడ్డు పరిస్థితుల కాలంలో విజయక్రాంతి తెలంగాణ జర్నలిస్టులకు, అందునా నమస్తే లాంటి పత్రికను నమ్ముకుని ఎటుకాకుండా పోతున్నామనే భయంతో ఉన్న వారికి ఇది కొండంత అండగా నిలుస్తున్నది.

 

You missed