యావత్తు తెలంగాణ దృష్టి మరల్చే కార్యక్రమానికి మరోసారి తెరతీశారు పాలకులు. దానిపేరే మునుగోడు ఉప ఎన్నిక. ఏమాత్రం అవసరం లేని సందర్భంలో కావాలని ‘గోక్కున్న’ ఎన్నికే ఇది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లో మీరు గోకినా… గోకకున్నా… నేను మాత్రం గోకుతూనే ఉంటా అన్న పదం దీనికి సంపూర్ణంగా సరిపోతుంది. రెండో దఫా అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం ఎదురుతన్నుతూనే ఉంది. అందులో మొదటిది ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో నాలుగు నెలలు రియాల్టర్లను, అమ్మకం దారులను, కొనుగోలు దారులను దారణంగా దెబ్బతియడం మొదటిదైతే… ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి సంపన్న రాష్ట్రం చేరుకోవడం చివరిదైతే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని గోకున్న ఎన్నికే ‘మునుగోడు’.

మునుగోడు ఉప ఎన్నికకు చాలా కారణాలే ఉన్నాయి. గతంలో బీజేపీలో కేసీఆర్ అనుయాయులు చాలా మందే ఉండేవారనేది ప్రసద్ధి. అయితే బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టిందని తెలిసి, కొందరు వారంతట వారే కేసీఆర్ కు దూరం జరిగితే… మరికొందరిని పార్టీనే దూరం పెట్టింది. అందులోనూ కేసీఆర్ పై అగ్గిబుగ్గయ్యే నాయకులు కూడా కొందరు పార్టీలో చేయడంతో కేసీఆర్ తో ఫైట్ దొంగచాటుగా కాకుండా డైరెక్టుగానే మారింది. దీంతో కేసీఆర్ కు బీజేపీలో పట్టు తప్పింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గతంలో కోమిటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిసేవారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకునేదే కాదు. అదేందుకో యావత్తు తెలంగాణకు కూడా తెలుసు. కేసీఆర్ కు దగ్గరి మిత్రులైన కోమిటిరెడ్డి బ్రదర్స్ లో ఒక్కరు బీజేపీలో చేరితే అది అతిమంగా ఎవరికి లాభమో మనమే అర్థం చేసుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో చావుదెబ్బకు గురైంది. రేవంత్ రెడ్డి ఎంత రెడ్డి ఎజెండాను ముందుకు తీసకువస్తున్నా… దాని ఫలితం కొంతే ఇస్తున్నప్పటికీ.. జీవగంజికి దగ్గరైన కాంగ్రెస్ కు కొంత చికిత్సనైతే చేస్తున్నాడు. ప్రస్తుతం రికవరి స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే కోమిటిరెడ్డి బ్రదర్సే దిక్కయ్యారు పాలకులకు. ఒక్కరు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. మరొక్కరు బీజేపీలోకి వెళ్తున్నారు. అంటే రాష్ట్ర‌ రాజకీయ పార్టీల గుట్టు మొత్తం ‘పెద్దాయ‌న‌’కు పక్కగా చేరుతుందన్నమాట. టీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో దెబ్బతిన్నా… నేగోషియేషన్ కు మనుషులు అవసరం పడతారు.. అందులో భాగంగానే ‘మన నాయకుడి’ మనుషులు పక్కగా అన్ని పార్టీలో సర్ధుబాటు చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు.

అంతిమ‌ లక్ష్యం డైవర్షనే….

ఇదంతా ఒక్కెత్తు అయితే మునుగోడు కయ్యం రాష్ట్రంలో లేవడం వల్ల అంతిమంగా టీఆర్ఎస్ పార్టీకే లాభం కలిగిస్తుంది. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. సరైన సమయానికి స్కాలర్ షిప్ లు లేవు, కళ్యాణలక్ష్మీ లేదు…. ఫించన్లు సరిగ్గా పడటం లేదు… ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. సర్పంచులైతే ఏకంగా అప్పులు తెచ్చి పనులు చేసి గోడుగోడు మని ఏడుస్తున్నారు. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా…. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగానే కనిపిస్తుంది. దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ కు ఆది నుండి తెలిసిన వ్యూహ్యం ఉప ఎన్నిక. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక వస్తే బీజేపీ గెలిచింది, హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీని చావుదెబ్బ తీసింది. జీహెచ్ఎంసీలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నిలిచాయి. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పటి నుంచో బీజేపీలో చేరుతానంటూ కాలం గడుపుతున్న రాజగోపాల్ రెడ్డిని పావుగా ఎంచుకుంది.

ఆయన రాజీనామాతో రాష్ట్ర‌ ప్రజల దృష్టి ని మరల్చేందుకు వ్యూహ్యం రచించింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా…. ఓడినా దక్కే ప్రయోజనం ప్రభుత్వం నడపానికి ఎలాంటి ఉప‌యోగం లేదు. ఓడితే తీర్పును అంచనా వేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను సాధారణ ఎన్నికల మూడ్ లోకి తీసుకు వస్తుంది. అదే ఊపులో ముందస్తుకు సిద్ధమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వారు గతంలో సాధించిన సీట్లకు అదనంగా మరో సీటు దక్కుతుంది. అయితే బీజేపీ స్పీడ్ మరింత పెరుగుతుందడనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇదే స్పీడ్ ను ఎన్నికల వరకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గనుకు తన సీటును కాపాడుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని నిరూపించనట్లైతుంది. ఇప్పుడిప్పుడే పార్టీ పరిస్థితిని అర్థం చేసుకుని కలిసి నడుస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి కొంత ఉత్సాహమైతే వస్తుంది. అదే ఉత్సాహాన్ని ఆ పార్టీ నాయకులు ఎన్నికల వరకు ఉంచుతారా…? రోజువారి కయ్యాలతో దాన్ని నిరుగార్చుతారో ?? వారే తేల్చుకోవాలి. మొత్తానికి మునుగోడు ఎన్నిక రాబోయే ప్రభుత్వం ఎలా ఉంటుందో ఒక డెమోగా అయితే ఉంటుంది.

Kishan Baggari

(senior journalist)

You missed