దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రానేవచ్చాయి. మళ్లీ కవిత పోటీ చేస్తదని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు రివర్స్‌ అయ్యాయి. బీఆరెస్‌ పార్టీ ఓడింది. ప్రభుత్వం పతనమైంది. బీఆరెస్‌ ఖాళీ అవుతుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆమె పోటీ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని అధినేత కేసీఆర్ తేల్చేశాడు. దీంతో అభ్యర్థి వేటలో పడ్దాడు కేసీఆర్.

అంతా తిరిగి తిరిగి మొత్తానికి రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ను ఎంచుకున్నాడు. ఇదే ఫిక్స్‌ చేశాడు. నేడో రేపో అధికారికంగా వెల్లడికానుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. ఇక జిల్లా రాజకీయాలకు కవిత దూరమైందని అంతా భావించారు. ఆమె ఇటువైపు చాయలకు కూడా రాకపోవడమూ అందుకు కారణమే. కానీ ఆమె బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనుంది. గులాబీ బాస్‌ ఆదేశించాడు. కవిత అభ్యర్థి కాకున్నా అభ్యర్థి లెక్కనే తిరుగుతదన్నమాట. అందిరకీ మళ్లీ ఒక్కతాటిపైకి తీసుకురావడం,అర్వింద్‌ను టార్గెట్ చేయడం.. కాంగ్రెస్‌ అభ్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధించడం ఇవన్నీ చేయడానికి సంసిద్ధమవుతోంది.

కాలికి బలపం కట్టుకుని లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆమె ప్రచారంలో కీలకంగా మారనుంది. అభ్యర్థిగా బాజిరెడ్డి వెంట ఉండనే ఉంటాడు. అయితే ఆర్మూర్, బోధన్‌, అర్బన్‌ నియోజకవర్గాల్లో బీఆరెస్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చే యోచనలో ఉన్నాడు అధినేత. అయితే మార్చినా, మార్చకపోయినా.. ఇన్చార్జిలు ఉన్నా లేకున్నా.. ఈ మూడింటిలో కవితే అంతా తానై వ్యవహించనున్నది. అంటే ఆయా నియోజకవర్గాల్లో చెల్లాచెదరుగా, అయోమయ పరిస్థితుల్లో ఉన్న నేతలు,క్యాడర్‌కు ఆమె భరోసా కల్పించనున్నది.

వాస్తవానికి ఈ పని ఎప్పుడో చేయాలి. కానీ ఆమె ఇటు వైపు కూడా రాలేదు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎట్టకేలకు బాజిరెడ్డికి లోక్‌సభ టికెట్‌ కన్‌ఫాం చేయడంతో కవిత కూడా బరిలోకి దిగనుంది బాజిరెడ్డికి తోడుగా. బాజిరెడ్డితో పాటు తనే ఎంపీగా బరిలో ఉన్నంతగా. గెలుపే ధ్యేయంగా. అర్వింద్ ఓటమే లక్ష్యంగా.

 

You missed